Gadwal Student Suicide: విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుల వైఖరే ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి ప్రాణాలను బలితీసుకున్న దారుణ ఉదంతం జోగుళాంబ గద్వాల జిల్లాలో వెలుగుచూసింది.
ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరంలో 440 మార్కులకు గాను ఏకంగా 434 మార్కులు సాధించి జిల్లాలోనే రెండో ర్యాంక్ సాధించిన విద్యార్థి తరుణ్ (17), కళాశాలలో లెక్చరర్ చేసిన అవమానాన్ని జీర్ణించుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Read Also :Thalliki Vandanam Scam:తల్లికి వందనం పేరుతో 28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం!
అసలేం జరిగింది?

గద్వాల జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ దంపతులు తెలుగు బుచ్చన్న, రేణమ్మల రెండో కుమారుడు తరుణ్. గద్వాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గత శనివారం కళాశాలలో ఒక మహిళా లెక్చరర్, మొదటి ర్యాంక్ (435 మార్కులు) వచ్చిన మరో విద్యార్థితో పోలుస్తూ తరుణ్‌ను అందరి ముందూ తీవ్రంగా హేళన చేశారు. ఇలా నిరుత్సాహపరచడం సరికాదని తరుణ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, సదరు లెక్చరర్ ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి “నువ్వేమైనా మంత్రి కుమారుడివా?” అని ప్రశ్నిస్తూ అందరి ముందూ చెంపపై కొట్టారు. నలుగురి ముందూ జరిగిన ఈ పరాభవాన్ని తరుణ్ తట్టుకోలేకపోయాడు. రెండు రోజుల పాటు తీవ్ర భావోద్వేగం, మానసిక ఒత్తిడికి గురైన అతడు, సోమవారం నాడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
“నన్ను నిరుత్సాహపరచకండి..”: కన్నీరు పెట్టించిన సూసైడ్ నోట్!
చనిపోయే ముందు తరుణ్ రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్ అక్కడ లభ్యమైంది. అందులో తన ఆవేదననంతా అక్షర రూపంలో వెళ్లగక్కాడు: ఒక విద్యార్థిని అతిగా పొగిడి, మరో విద్యార్థిని నిరుత్సాహపరచడం సరైనది కాదు. లెక్చరర్‌గా ప్రోత్సహించకపోయినా పర్వాలేదు కానీ నిరుత్సాహపరచకండి. నా చావుకు కారణమైన ఆ లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది.” - తరుణ్ రాసిన సూసైడ్ నోట్
Gadwal Student Suicide: స్పందించిన కళాశాల ప్రిన్సిపల్
ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ వీరన్న స్పందిస్తూ.. సోమవారం ఉదయం తరుణ్ తన వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పాడని తెలిపారు. విద్యార్థికి ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ ఇచ్చామని, అలాగే సదరు లెక్చరర్‌ను మందలించామని పేర్కొన్నారు. అయితే, అంతలోనే తరుణ్ ఇలా దారుణ నిర్ణయం తీసుకోవడం తమను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి ఉపాధ్యాయురాలి ప్రవర్తన వల్ల ప్రాణాలు కోల్పోవడంపై బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

