Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లేపాక్షి కళారూపాలు ఇక డోర్ డెలివరీ:సవిత ప్రకటన!

లేపాక్షి కళారూపాలు ఇక డోర్ డెలివరీ:సవిత ప్రకటన!

వార్త 3 days ago

Minister Savitha: ఆంధ్రప్రదేశ్‌లోని హస్త కళాకారులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. సాంప్రదాయ హస్త కళారూపాలను డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసేందుకు ఈ-కామర్స్, సోషల్ మీడియా వేదికలను పూర్తిస్థాయిలో వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.

సవిత వెల్లడించారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ హస్తక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో బుధవారం ఆమె ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లేపాక్షి ఎండీ విశ్వ మరియు ఇతర అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో నూతన లేపాక్షి షోరూమ్‌ల ఏర్పాటు, ప్రస్తుతమున్న కేంద్రాల ఆధునీకరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

నేరుగా ఇళ్లకే లేపాక్షి కళారూపాల డోర్ డెలివరీ

లేపాక్షి షోరూమ్‌ల ద్వారా జరిగే విక్రయాలకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతను జోడించి ఆన్‌లైన్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లతో పాటు సొంత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కళారూపాలను వినియోగదారుల ఇళ్లకే నేరుగా డోర్ డెలివరీ చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే ఆప్కో (APCO) షోరూమ్‌ల ద్వారా చేనేత వస్త్రాలను ఆన్‌లైన్ లో డోర్ డెలివరీ చేస్తున్న విధానాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.

ఢిల్లీ, కాకినాడ షోరూమ్‌లు ప్రారంభానికి సిద్ధం

రాష్ట్రంలో మరియు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న లేపాక్షి ఎంపోరియంలను నూతన హంగులతో, వినియోగదారులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆధునీకరణ మరియు మరమ్మతు పనులు పూర్తి చేసుకున్న దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు కాకినాడలోని లేపాక్షి షోరూమ్‌లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఎయిర్‌పోర్టుల్లో కూడా నూతన లేపాక్షి షోరూమ్‌ల ఏర్పాటుకు కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ అంగీకారం తెలిపిందని, ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Minister Savitha: 365 రోజుల పాటు హస్త కళాకారులకు ఉపాధి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం హస్త కళాకారులకు ఏడాది పొడవునా (365 రోజులు) నిరంతరాయంగా ఉపాధి కల్పించడమేనని మంత్రి సవిత పునరుద్ఘాటించారు. కేవలం లాభాపేక్షతో కాకుండా మరుగున పడిపోతున్న మన సంస్కృతిని, కళలను కాపాడుతూనే, వాటి అమ్మకాలను భారీగా పెంచడం ద్వారా కళాకారుల కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపాలని అధికారులను కోరారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు పక్కా కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha