System Movie: ఈ మధ్య కాలంలో టాలీవుడ్, బాలీవుడ్ లలో కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్య కథలకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. ఒక ఇంట్రెస్టింగ్ లీగల్ డ్రామాతో నేరుగా 'అమెజాన్ ప్రైమ్' ఓటీటీకి వచ్చిన సినిమానే 'సిస్టమ్'.
సోనాక్షి సిన్హా, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అశ్వనీ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథాకథనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Read Also : Weekend OTT : వీకెండ్ ఓటీటీ మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్.. 26 కొత్త రిలీజ్‌లు
System Telugu Movie Review
కథ
System Movie: ఢిల్లీ హైకోర్టులో రవి రాజ్ వంశ్ (అశుతోష్ గోవారికర్) ఒక సీనియర్, పేరుమోసిన న్యాయవాది. ఆయన ఒక కేసు టేకప్ చేశాడంటే, అందులో ఖచ్చితంగా గెలవాల్సిందే. అందువల్లనే ఆయన కేవలం శ్రీమంతుల కేసులను మాత్రమే వాదిస్తాడనే పేరు ఉంటుంది. ఆయన కూతురు నేహా రాజ్ వంశ్ (సోనాక్షి సిన్హా) కూడా అదే కోర్టులో లాయర్ గా పనిచేస్తూ, తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని తపన పడుతుంటుంది.
ఇదే కోర్టులో సారిక రావత్ (జ్యోతిక) స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తుంటుంది. ఒక ప్రమాదంలో భర్త రెండు కాళ్లు కోల్పోవడంతో, ఒక చిన్న అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబ భారాన్ని తనే మోస్తుంటుంది. ఒకరోజు సారికకు నేహా తన కారులో లిఫ్ట్ ఇస్తుంది. ఆ సమయంలో సారిక ఆలోచనా విధానం నచ్చిన నేహా, ప్రతి కేసుకి రూ. 20 వేలు ఇస్తానని చెప్పి ఆమెను తన లీగల్ అసిస్టెంట్ గా మార్చుకుంటుంది. సారిక ఇచ్చే ప్రాక్టికల్ సూచనలతో నేహా కోర్టులో వరుస కేసులు గెలవడం మొదలుపెడుతుంది.
ఇలా సాగుతున్న క్రమంలో ‘ఇనయా కొఠారి’ హత్య కేసు నేహా ముందుకు వస్తుంది. ఈ కేసులో నిందితుడు విక్రమ్ బజ్రాల్ అనే పెద్ద వ్యాపారవేత్త. అతను నేహా తండ్రి రవి రాజ్ వంశ్ కి మంచి స్నేహితుడు కావడంతో, అతని తరఫున వాదించడానికి రవి రంగంలోకి దిగుతాడు. అంతేకాదు, ఈ కేసులో తనకు వ్యతిరేకంగా వాదించవద్దని కూతురు నేహాను హెచ్చరిస్తాడు. అయినా తండ్రి మాట వినకుండా నేహా ఇల్లు వదిలి వచ్చేసి, సాక్ష్యాధారాల కోసం అన్వేషణ మొదలుపెడుతుంది. గతంలో ‘ట్విస్టెడ్ బార్’లో జరిగిన ఒక అగ్ని ప్రమాదానికీ, ఈ ఇనయా కొఠారి హత్యా కేసుకు సంబంధం ఉందనే విషయాన్ని నేహా పసిగడుతుంది. అసలు ఆ బార్ లో ఏం జరిగింది? ఇనయాను ఎవరు హత్య చేశారు? విక్రమ్ బజ్రాల్ కేసు ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ కేసును గెలవడానికి నేహాకు సారిక ఎలాంటి సహాయం అందించింది? అనేదే మిగతా సినిమా.
కథనం
కథ ఆరంభంలో పాత్రల పరిచయం వల్ల కాస్త నిదానంగా సాగుతుంది. నాలుగు గోడల మధ్యే (కోర్టు రూమ్) కథను ఎక్కువగా నడిపించారు. అయితే, ఎప్పుడైతే నేహా తన తండ్రిని ఎదిరించి ఇల్లు వదిలి బయటకు వస్తుందో, అప్పటి నుంచి కథలో కదలిక వస్తుంది. విక్రమ్ బజ్రాల్ కేసుకు సంబంధించిన ఆధారాల కోసం సాగే అన్వేషణతో సెకండాఫ్ ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ నుంచి కథనం వేగం పుంజుకుని, క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్లు ప్రేక్షకులను రక్తి కట్టిస్తాయి.
ముగింపు
ఢిల్లీ రద్దీ వాతావరణం, అక్కడి విలాసవంతమైన జీవితాలతో పాటు మిడిల్ క్లాస్ బతుకులు ఎలా ఉంటాయనేది దర్శకుడు బాగా చూపించారు. నటీనటుల విషయానికి వస్తే సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవారికర్ తమ నటనతో ఆకట్టుకున్నారు. కథ ఓ మోస్తరుదే అయినప్పటికీ, కథనం (స్క్రీన్‌ప్లే) వైపు నుంచి కుతూహలాన్ని పెంచడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ విభాగాలు సినిమాకు తగినట్టుగా ఫరవాలేదు అనిపిస్తాయి. కోర్టు రూమ్ డ్రామాలు, సందేశాత్మక చిత్రాలను ఇష్టపడే వారికి ‘సిస్టమ్’ ఒక మంచి ఓటీటీ ఛాయిస్ కాగలదు
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

