Loan Recoveries : రుణ వసూళ్ల పేరుతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అవలంబిస్తున్న కొన్ని వివాదాస్పద పద్ధతులకు అడ్డుకట్ట వేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక ఆదేశాలు జారీ చేసింది.
పర్సనల్, వెహికల్, హోమ్ లేదా ఇతర రకాల రుణాల చెల్లింపుల్లో విఫలమైన (Default) కస్టమర్ల డిజిటల్ సాధనాలైన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను రిమోట్‌గా బ్లాక్ చేయడం లేదా పనిచేయకుండా (Disable) చేయడం చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే, బ్యాంక్ అందించిన నిర్దిష్ట రుణంతోనే ఆ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసి ఉంటే మాత్రం వాటిని డిసేబుల్ చేసే సదుపాయం బ్యాంకులకు ఉంటుందని తెలిపింది. కానీ, అది కూడా మిగతా అన్ని రకాల లోన్ రికవరీ ప్రయత్నాలు విఫలమైన తర్వాత చివరి అస్త్రంగా మాత్రమే పరిశీలించాలని స్పష్టమైన నిబంధనలు విధించింది.

2027 జనవరి 1 నుంచి అమల్లోకి: ఖాతాదారులకూ సూచనలు
ఈ నూతన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. డిజిటల్ రుణాల చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకత పెంచడంతో పాటు, కస్టమర్ల వ్యక్తిగత సమాచార భద్రతను రక్షించడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రుణాలు తీసుకున్న ఖాతాదారులు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సెంట్రల్ బ్యాంక్ సూచించింది. రుణ వసూళ్ల ప్రక్రియలో భాగంగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి వచ్చే అధికారిక ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ (SMS)లను బ్లాక్ చేయడం లేదా అడ్డుకోవడం లాంటి చర్యలు చేయవద్దని కస్టమర్లను కోరింది.

