Srinivas Goud Padayatra: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చుట్టూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు.
తమ పాదయాత్ర ప్రకటనకు భయపడే కాంగ్రెస్ సర్కార్ హడావిడిగా మంత్రులు, ఎమ్మెల్యేలతో సచివాలయంలో సమీక్షలు నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ పాదయాత్రకు భయపడే సమీక్షలు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. వచ్చే నెలలో తాము చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించిన కార్యాచరణ రూపొందించుకుంటున్నామని ప్రకటించగానే కాంగ్రెస్ సర్కార్‌లో వణుకు మొదలైందన్నారు. అందువల్లే హడావిడిగా ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సచివాలయంలో నాటకీయంగా సమీక్షా సమావేశం నిర్వహించారని ఎద్దేవా చేశారు.
అధికారులు లేకుండా సమీక్ష చేయడం ఏంటి?
కనీస అవగాహన లేకుండా నిర్వహిస్తున్న ఈ సమీక్షల్లో ఉన్నతాధికారులు కానీ, ప్రాజెక్టు ఈఎన్‌సీ (ENC) కానీ ఎవరూ లేకపోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుపై ఎలాంటి అవగాహన లేని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు లేకుండా ఏం సమీక్షించారో జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఒక్కరోజు కూడా ఈ రెండున్నర ఏళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో చూసిన పాపాన పోలేదని మండిపడ్డారు.

మంత్రులకు, ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే నార్లాపూర్, ఏదుల, వట్టెం పంప్ హౌస్‌లను, రిజర్వాయర్లను సందర్శించి అక్కడ కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతాలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.
Srinivas Goud Padayatra: కేసీఆర్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కక్షపూరితంగా పక్కనబెట్టారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
- పెండింగ్ పనులు: కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులను 90 శాతం పూర్తి చేశామని, కేవలం 10 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.
- టన్నెలింగ్ పూర్తి: పంప్ హౌస్‌ల నుంచి టన్నెలింగ్ వరకు మొత్తం పనులు బీఆర్ఎస్ హయాంలోనే కంప్లీట్ అయ్యాయన్నారు.
- టెండర్ల రద్దు: తాము కాలువల తవ్వకాలకు టెండర్లు పిలిచి ఖరారు చేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కక్షపూరితంగా వాటిని రద్దు చేసిందని ధ్వజమెత్తారు. ఒకవేళ ఆ టెండర్లను రద్దు చేయకుండా ఉండి ఉంటే, ఈరోజు జిల్లాలోని నాలుగు ప్రధాన రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతూ ఉండేవన్నారు.
ప్రాజెక్టు పూర్తయ్యే వరకు విడిచిపెట్టేదే లేదు
తమకు రాజకీయ విమర్శలు చేయడం ముఖ్యం కాదని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావడమే ఏకైక లక్ష్యమని మాజీ మంత్రి స్పష్టం చేశారు. రాబోయే పాదయాత్ర ద్వారా కేసీఆర్ హయాంలో తాము చేసిన పనులను ప్రజలకు స్వయంగా చూపిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శలు మానుకుని, ఈ రెండున్నర ఏళ్లలో తాము చేసిన తట్టెడు మట్టి పనైనా ప్రజల ముందు చూపించాలని సవాల్ విసిరారు. పాదయాత్రతో జిల్లాలోని రైతులను, ప్రజలను జాగృతం చేస్తామని, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని హెచ్చరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

