CM Revanth Reddy Visits Maddur: నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండల కేంద్రంలో కొనసాగుతున్న పలు కీలక అభివృద్ధి పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.
రేవంత్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మద్దూరుకు చేరుకున్న సీఎంకు జిల్లా కలెక్టర్ ప్రియాంక హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం నేరుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణ పనుల వద్దకు చేరుకున్నారు. కళాశాల భవన నమూనా చిత్రపటాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. కేటాయించిన స్థలం, నిర్మాణ విస్తీర్ణం, తరగతి గదులు, ప్రయోగశాలల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 4 ఎకరాల స్థలంలో 13,670 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు టీజీఈడబ్ల్యూఐడీసీ (TGEWIDC) ఎండీ గణపతిరెడ్డి సీఎంకు వివరించారు.
కళాశాల ప్రాంగణ విస్తరణకు ఆదేశాలు - మార్చి నాటికి అందుబాటులోకి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కళాశాల భవనం పక్కన ప్రధాన రహదారి వైపు ఉన్న అదనపు భూమిని తక్షణమే సర్వే చేయించాలని, అది పట్టా భూమి అయితే రైతులతో మాట్లాడి కొనుగోలు చేసి కళాశాలకు విశాలమైన ప్రాంగణం, పటిష్టమైన ప్రహరీ గోడను నిర్మించాలని కలెక్టర్ ప్రియాంకకు సూచించారు. వచ్చే మార్చి నెల నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి, రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు భవనాన్ని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. మద్దూరు ప్రాంతంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

CM Revanth Reddy Visits Maddur: గురుకుల బాలికల పాఠశాల పరిశీలన - భూమిచ్చిన దాతలకు ఇందిరమ్మ ఇండ్లు
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో చింతల్‌దిన్నె వైపు వెళ్లి అక్కడ కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కాంట్రాక్టర్లు, అధికారులను హెచ్చరించారు. గురుకుల పాఠశాల నిర్మాణానికి ముందుకొచ్చి ఉదారంగా స్థలం ఇచ్చిన దాతలకు తక్షణమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీధర్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ‘కడా’ (KADA) ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, మద్దూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్ది భీములు, సింగిల్ విండో చైర్మన్ నర్సింహులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు

