Dailyhunt
మద్యాన్ని మట్టుపెట్టే మార్గమే లేదా?

మద్యాన్ని మట్టుపెట్టే మార్గమే లేదా?

వార్త 2 weeks ago

Alcohol : దొరతనంబునందు దొంగతనంబు నందు భాగ్యవంతు నికి ఏదైనా బాధలేదు' ఇది ఎవరిని ఉద్దేశించి, ఏ సందర్భం లో ఎంతకాలం క్రితం చెప్పారో కానీ అందులో అర్థం, పర మార్థం ఎంతో ఉంది.

అంతకు పూర్వం కూడా శ్రీనాథ కవి సిరిగలవానికి ఎందరు భార్యలున్నా పర్వాలేదు కానీ, బిచ్చ మెత్తుకునే మీకెందుకు ఇద్దరు భార్యలని ఏకంగా పరమ శివుడినే ప్రశ్నించారు. అప్పుడే కాదు నేడు కూడా లక్ష్మీకటాక్షం లేకపోతే జీవనం సాగించడం ఎంత దుర్బరంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. వ్యక్తికానీ, కుటుంబం కానీ, సంస్థలు కానీ, చివరకు ప్రభుత్వం కూడా ఆదాయం లేకుండా నడవడం, నడపడం సాధ్యం కాదనేది జగమెరిగిన సత్యం. అందులోనూ ప్రజాసంక్షేమమే ధ్యేయమని చెప్పు కుంటూ నిరుపేద బలహీన బడుగు వర్గాల అభ్యున్నతికి లక్షలాది కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా వెచ్చి స్తున్న ఈ రోజుల్లో నిధులు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇందుకోసం అటుకేంద్రప్రభుత్వం కానీ, ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజల మీద భారం వేయకతప్పదు. అందులో మరో వాదనకు తావులేదు. నిధుల సమీకరణకు అప్పులో లేక పన్నులో తప్ప మరో మార్గం లేదనేది తెలిసిందే. అధికారంలో ఎవరున్నా ఏదో ఒక రూపంలో ప్రజలవద్ద నుంచి డబ్బులు వసూలు చేయక తప్పదు. అది సరిపోనప్పుడు అప్పుల బాట ఉండనే ఉంది. కానీ అందుకు ఒక పద్దతి ఉండాలి. ఒక విధానం ఉండాలి. ఒక మార్గం ఉండాలి. ఎన్నిపన్నులు వేసినా, మరే రూపం లో నిధులు సేకరించే ప్రయత్నం చేసినా అందువల్ల ప్రజ లకు కష్టనష్టాలు ఉండకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. కానీ అందుకు ప్రభుత్వాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయేమోననిపిస్తు న్నది. పన్నులు వేసే కొద్దీ ధరలు పెరుగుతాయి.

Read Also : LPG Gas Crisis: ఎల్‌పీజీ సంక్షోభంతో బెంగళూరు అతలాకుతలం..ఆటో డ్రైవర్లు విలవిల

 alcohol

alcohol : అడిగినవే కాదు ప్రజలు కోరనివి కూడా ప్రకటిస్తున్నారు

జిఎస్టీ అన్నా, మరే రూపంలో పన్నులు ఏ వస్తువులపై వేసినా చివరకు ఆ భారమంతా మోయాల్సింది ప్రజలనేది వాస్తవం. అంతేకాదు ఈ ఆదా యాన్ని దృష్టిలో పెట్టుకొని పాలకులు వ్యయం చేస్తున్నారు. కానీ గత రెండు, మూడు దశాబ్దాలుగా పరిస్థితులు మారి పోయాయి. ఆదాయం గురించి పట్టించుకోవడం లేదు. ఇష్టానుసారంగా పథకాలు ప్రకటిస్తున్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం అధికారం కోసం జనాకర్షణ పథకాలు కోకొల్లలుగా ప్రకటిస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో అయితే వరాలకు హద్దే లేకుండాపోతున్నది. ప్రస్తుతం జరగబోతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల్లో కొన్ని పార్టీలు చేస్తున్న ప్రకటనలు, హామీలు ప్రజాస్వామ్య వాదులు విస్తుపోతున్నారు. అడిగినవే కాదు ప్రజలు కోరనివి కూడా ప్రకటిస్తున్నారు. అవన్నీ పూర్తిగా అమలుచేయాలంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కావాలో పట్టించుకోవడం లేదు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు అప్పుల ఊబిలో దిగబడి పోయాయి. నెలనెలా జీతభత్యా లు చెల్లిండానికే నిధులు వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్లు ఉంది. మరొక పక్క ఆదాయం పెంచుకునేందుకు నిత్యం అన్వేషణ జరుగుతున్నది. ఇందులో మంచి, చెడుల గురించి కూడా ఆలోచిస్తున్నట్లు లేదు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చెప్పుకుంటున్న పాలకులు చేతల్లోకి వచ్చేసరికి నిధుల సేకరణ ఆరాటంలో అవేమీ పట్టించుకోవ డం లేదు. ముఖ్యంగా మద్యం ఆదాయాన్ని పెంచుకోవడం లో పాలకులు పడుతున్న ఆరాటంలో ఎందరో బడుగు జీవు లు సమిధులై పోతున్నారు.

మద్యానికి బానిసై చితికిపోతు న్నా..

యేడాదియేడాదికి ఎక్సైజ్ ఆదా యం వేల కోట్లల్లో పెరుగుతున్నది. ఈ ఆదాయం ఊహిం చని రీతిలో పెరుగుతున్నదని ఎక్సైజ్ అధికారులు గర్వంగా చెప్పుకుం టున్నారు. పెంచేందుకు అన్ని మార్గాలను అవ లంబిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఎక్సైజ్ ఆదాయమే ఖజానాకు ప్రధాన ఆర్థిక వనరుగా మారిపోయిందని చెప్పొ చ్చు. ఒక్క విషయాన్ని విస్మరిస్తున్నారు. ప్రభుత్వం రూపొం దించిన మద్యం విధా నాలు, అందువల్ల ఆదాయం పెరుగు తున్నా అంతిమంగా సమాజంపై అనేక రూపాల్లో దుష్ప్రభా వాన్ని చూపుతున్నది. తాగుడు మూలంగా రహదారి ప్రమా దాలు, మహిళలపై అఘాయిత్యాలు, గృహహింస లైంగిక వేధిం పులు లాంటి నేరాలు అంతులేకుండా పెరిగిపోతున్నా యి. నిత్యం రహదారులను రక్తసిక్తం చేస్తున్న ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లు అధిక శాతం మద్యం మత్తులోనే వాహ నాలు నడిపి ప్రమాదాలకు కారణాలవుతున్న విషయం అధికార గణాంకాలే వెల్లడిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ని లక్షల కుటుంబాలు ఈ మద్యానికి బానిసై చితికిపోతు న్నాయో అంచనాకే అందదు. ఎందరో రోగపీడితులై మంచా నికే పరిమితమై తాగి, తాగి కృంగికశించి అసువులు బాస్తు న్నారు. ఇన్ని అనర్థాలకు మూలమైన మద్యాన్ని పాలకులు పెంచి పోషించడం, ఆదాయం కోసం ప్రజలతో తాగించడం, ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమో విజ్ఞతతో ఆలోచించాలి. దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాలు నిషే ధించినా మద్యం వాడకం అంతకంతకు పెరిగిపోతున్నది.

ప్రజారోగ్యా న్ని కాటేస్తున్నది

యేటా మద్యం అమ్మకాల విలువ దేశవ్యాప్తంగా దాదాపు ఐదారు లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అనధికార అంచనా. అన్నిటికంటే ముఖ్యంగా అక్రమ సారాను నిరోధించేందుకు ఎవరి ఆలోచనోఏమో కానీ చీప్ లిక్కర్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు దేశంలోకానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ అధిక శాతం అమ్మకాలు ఈచీప్ లిక్కరే. ఇదే ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నది. ఎందరో నిరుపేదలు ఈ చీప్ లిక్కర్ తాగి అర్థాంతరంగా మరణిస్తున్నారు. కల్తీసారా కూడా ప్రజారోగ్యా న్ని కాటేస్తున్నది. మొన్నామధ్య తమిళ నాడులో కల్తీసారా కాటుకు ఏకంగా అరవైమందికి పైగా అమాయకులు బలైపోయారు. తమిళనాడులోని కళ్లుకుర్చి జిల్లా కరుణాపురానికిచెందిన దంపతులిద్దరు కల్తీసారా తాగి చనిపోయారు. ఇది అధికారులకు సమాచారం అందినా చర్యలుతీసుకోలేదు. పైగా దంపతులు ఇద్దరు చనిపోయారు. కల్తీసారా వల్ల చనిపోయారనే బాధితులు ఆరోణలను కోట్టి వేస్తూ కల్తీసారా వల్ల కాదని ఆ జిల్లాకలెక్టర్ అధికారికంగానే ప్రకటించారు. దాంతో ఈ దంపతులు పార్ధివదేహాలకు జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న కరుణాపురం వాసులు నూటతొంభై మూడు మంది అదే కల్తీసారా తాగారు. ఆరోగ్యం విషమించి మరుసటి రోజుకు యాభైనాలుగు మంది, ఆ తర్వాత మరో అరడజన్ కుపైగా మృతిచెందారు. జరగా ల్సింది జరిగిన తర్వాత స్పందించిన తమిళనాడు ప్రభుత్వం విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకు కలెక్టర్ను బదలీ చేసింది. అంతకుముందు తమిళనాడులోని కల్తీసారా రక్కసి ఇరవైమూడు మందిని మింగేసింది. సారానిషేధం ప్రకటిం చిన బీహార్ రాష్ట్రంలో కూడా పదిమంది పరలోకానికి పయ సంకట్టారు.

 alcohol

మధ్యాదాయమే మహాప్రసాదం

ఇలా దేశవ్యాప్తంగా ఎందరో బలైపోతున్నారు. పంజాబ్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్త దితర రాష్ట్రాల్లో సారా మహమ్మారి విజృంభించి ఎన్నో కుటుంబాలను చిదిమేస్తున్నది. ఇందులో చాలా మరణాలు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్క డంలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో సారా మహమ్మారి ఇరవైఏడు మంది ప్రాణాలను బలికొన్నది. మృతులు ఎందరో రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు. ఇలా ఎన్నో ఉదాహరణల ను చెప్పొచ్చు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభు త్వాలదని మన రాజ్యాంగం స్పష్టం చేస్తున్నది. ఏరకంగా చూసినా ప్రజారోగ్యంతో ఆటలాడు తున్న ఈ మద్యాన్ని నిషేధించాల్సిన అవసరం గురించి పెద్దలకు తెలియంది కాదు. అయినా దశలవారీగా తగ్గిస్తామని వేదికలెక్కి ఉపన్యా సాలు, హామీలు ఇచ్చిన పెద్దలే అంచలం చెలుగా విస్తరిస్తు న్నారు. మధ్యాదాయమే మహాప్రసాదంగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోయే స్తోమత ప్రభుత్వాలకు లేదని పెద్దలు చెప్తున్నారు. ఈ కారణంగానే బార్లు, షాపులు అవసరమైతే సమయాన్ని అర్ధరాత్రివరకు పొడిగించి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. జూదం, వ్యభిచారం, మత్తుపదార్థాలు లాటరీ లాంటివి ప్రభుత్వ ఆదాయవనరులు కారాదని రాజ్యాంగంలోని 47వ నిబంధన స్పష్టం చేస్తున్నది. ఈ నిబంధనలను కొట్టివేయించేందుకు కొందరు మద్యం వ్యాపారులు 1978 లోనే దేశ అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం వేశారు. వాదోపవా దాలు విన్న సుప్రీం కోర్టు మద్యపాన నిషేధాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. అటురాజ్యాంగాన్ని, ఇటు న్యాయ స్థానాల ఆదేశాలను పాటించకుండా ఆదాయమే పరమావధి గా పాలకులు వ్యవహరించడం అత్యంత బాధాకరం.

-దామెర్ల సాయిబాబ

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రష్యా నుండి వెల్లువలా వస్తున్న చమురు.. ఇంధన ధరల పెరుగుదలకు చెక్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha