Mahalakshmi Scheme: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' పథకాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని నిర్ణయించింది.
ఈ పథకంలో కీలకమైన రూ. 500 కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సదుపాయాన్ని కొత్తగా మరో 5 లక్షలకు పైగా పేద కుటుంబాలకు వర్తింపజేయాలని ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి అర్హత గల లబ్ధిదారుల జాబితాను పౌరసరఫరాల శాఖ ఇప్పటికే సిద్ధం చేయగా, తుది ఆమోదం కొరకు ఆర్థిక శాఖకు ఫైల్ పంపడం జరిగింది. ఆర్థిక శాఖ నుంచి అధికారిక అనుమతులు లభించి, నిధులు విడుదలైన వెంటనే కొత్త లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ జమ కానుంది.

ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 42.90 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. 2024 ఫిబ్రవరిలో ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేయగా, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘ప్రజా పాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో సుమారు 91.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు తొలి విడతలో 42.90 లక్షల మందిని అర్హులుగా గుర్తించి సబ్సిడీని వర్తింపజేశారు. ఈ లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ రీయింబర్స్‌మెంట్ అందించేందుకు ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో రూ. 723.30 కోట్లను కేటాయించింది.
కొత్త రేషన్ కార్డుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక మరియు సబ్సిడీ జమ ప్రక్రియ
రాష్ట్రంలో మొత్తం 1.20 కోట్లకు పైగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకే ఈ రాయితీని పరిమితం చేశారు. గతంలో వివాహం చేసుకొని కొత్తగా వేరు కాపురం పెట్టిన వారికి ప్రత్యేకంగా రేషన్ కార్డులు లేకపోవడం, ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్న కుటుంబాలకూ ఒకే కార్డు ఉమ్మడిగా ఉండటం వంటి సాంకేతిక కారణాల వల్ల పలు అర్హత గల పేద కుటుంబాలు ఈ పథకానికి దూరమయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం 2025 జనవరి నుంచి 2026 జులై మధ్య కాలంలో పెద్ద ఎత్తున అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది.
ఇలా కొత్తగా రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తులు సమర్పించారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ అధికారులు పరిశీలించి, తాజాగా మరో 5 లక్షలకు పైగా కుటుంబాలను అర్హులుగా నిక్కచ్చిగా నిర్ధారించారు. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, ఉమ్మడి జిల్లాల వారీగా ఈ కొత్త లబ్ధిదారుల తుది జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి.. వల్లకాటి రాజ్ కుమార్

