Telangana : తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (BC) మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లోని సచివాలయంలో అధికారికంగా ఈ ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సాంప్రదాయ విధానాలకు భిన్నంగా మహిళల శ్రమను తగ్గించి, తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి సాధించేలా అధునాతన ఆటోమేటిక్ కుట్టు మిషన్లను లబ్ధిదారులకు అందించనున్నారు. మహిళలు తమ ఇళ్ల వద్ద నుంచే టైలరింగ్ ద్వారా స్థిరమైన ఆదాయం పొందుతూ, సొంత కాళ్లపై నిలబడేలా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది.

100% సబ్సిడీతో 1.19 లక్షల మహిళలకు ప్రయోజనం
రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేయనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 1,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్ల చొప్పున మొత్తం 1,19,000 మంది అర్హులైన బీసీ మహిళలకు వీటిని పంపిణీ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అత్యంత కీలకమైన అంశమేమిటంటే, లబ్ధిదారులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతోనే ఈ మిషన్లను ఉచితంగా అందజేస్తున్నారు. నైపుణ్యం కలిగిన మహిళలకు అవసరమైన మార్గదర్శకాలు, ఎంపిక ప్రక్రియ వివరాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించనుంది.

