Vangalapudi Anitha: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాల సంఘటనల్లో నిందితులను 24 గంటల నుండి 48 గంటల్లోపు అరెస్టు చేస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
ఆదివారం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై ఎలాంటి ఆఘాయిత్యాలు జరిగినా 24 గంటల నుండి 48 గంటల్లోపే నిందితులను పట్టుకోవడం జరుగుతోందని, అలాగే నిందితులకు త్వరితగతిన తగిన శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలో ఫోరెన్సిక్ విభాగంను బలోపేతం చేసినట్లు మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
Minister Anitha at Kanipakam temple
Vangalapudi Anitha: పోక్సో కేసుల్లో వేగవంతమైన శిక్షలు
సంఘటన జరిగిన వెంటనే ఫోరెన్సిక్ విభాగం సిబ్బంది సంఘటనా స్థలం చేరుకుని ఆధునాతన పద్దతుల్లో ఆధారాలు సేకరించడం, సేకరించిన ఆధారాలను కోర్టుల్లో సమర్పించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పోక్సో కేసుల్లో నిందితులకు 3, 4 నెలల్లోపే శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఇందుకు ప్రజలు కూడా పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా వుండగా భక్తి ప్రమాణాలకు నెలవైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని దర్శించుకోవడం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు. కాణిపాకం దేవస్థానంలో గత 50 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి గత రెండు మూడు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్నదన్నారు.
కాణిపాకం ఆలయ అభివృద్ధికి కొత్త నిధులు
ఇందులో భాగంగా సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు కాణిపాకంలో ప్లై ఓవర్ ఏర్పాటు చేయడంతో పాటు టిటిడి అందిస్తున్న రూ. 25 కోట్లతో కళ్యాణ మండపాల నిర్మాణం, రూ.15 కోట్ల దేవస్థానం నిధులతో వంద గదుల సత్రం నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భక్తులకు అన్ని వసతి సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే దినదినాభివృద్ధి చెందుతున్న కాణిపాకం దేవస్థానంలో భక్తులు ఆలయ భద్రత దృష్ట్యా 190 సిసి కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేయడంతో పాటు దేవస్థానంలో దొంగతనాలు, అసాంఘీక కార్యక్రమాలు వంటి వాటిని గుర్తించడానికి సిసి కెమెరాలను ఎఐతో అనుసంధానం చేస్తున్నామన్నారు.
ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతలు ఎంతో మెరుగయ్యాయని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్పీ తుషార్ డూడి, ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఎఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్బాబు, చిత్తూరు డిఎస్పీ వెంకట నారాయణ, ఆలయ ఛైర్మన్ మణి నాయుడు, ఇఒ కె.పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

