Karakkam Movie: మలయాళ సినీ పరిశ్రమ నుంచి హారర్ కామెడీ జోనర్‌లో ఏదైనా సినిమా వస్తోందంటే ఓటీటీ ప్రేక్షకులలో సహజంగానే మంచి అంచనాలు ఉంటాయి. వైవిధ్యమైన కథలను, సహజత్వానికి దగ్గరగా ఉంటూనే ఆసక్తికరంగా తెరకెక్కించడంలో మాలీవుడ్ దర్శకులు దిట్ట.
ఆ నమ్మకంతోనే థియేటర్లలో విడుదలైన చిత్రాలు ఓటీటీలోకి రాగానే ప్రేక్షకులు ఎగబడుతుంటారు. అలా సుభాశ్ లలిత దర్శకత్వంలో శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘కరక్కం’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘సోనీ లివ్’ (Sony LIV) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ సమీక్షలో చూద్దాం.
‘Karakkam’ Movie Review!
Karakkam Movie: కథ
ధనుష్ (శ్రీనాథ్ భాసి) ఒక సాధారణ డాన్సర్. పెద్దగా సంపాదన లేకపోవడంతో కుటుంబ సభ్యుల నుంచి నిత్యం అవమానాలు, అసహనాన్ని ఎదుర్కొంటూ ఉంటాడు. తన ప్రేయసి పింకీ (ఫెమీనా జార్జ్) చూపించే ప్రేమే అతనికి ఏకైక ఊరట. ఇలాంటి పరిస్థితుల్లో ధనుష్‌కు ‘ఖాజా’ (ప్రవీణ్) అనే వ్యక్తి పరిచయమవుతాడు. ఒక న్యూ ఇయర్ వేడుకల రాత్రి వీరిద్దరూ విపరీతంగా మద్యం సేవించి, మత్తులో స్థానిక స్మశానానికి చేరుకుని అక్కడే పడిపోతారు.
తెల్లవారుజామున కాస్త మత్తు వదిలిన తర్వాత, స్మశానంలోని సమాధులపై ఉన్న ఐదు విలువైన ఇత్తడి శిలువలు వారి కంటపడతాయి. వాటిని అమ్మేసి సులువుగా డబ్బు సంపాదించవచ్చనే దురాశతో ఆ శిలువలను దొంగిలిస్తారు. ఆ సమయంలోనే ధనుష్ తన రూమ్ తాళం చెవిని (Key) స్మశానంలోనే పారేసుకుంటాడు. ఆ శిలువలను కొనడానికి వారు ‘వర్గీస్’ అనే వ్యాపారి దగ్గరకు వెళ్లగా, అతను అప్పటికప్పుడే గుండెపోటుతో చనిపోతాడు. దాంతో ఏం చేయాలో పాలుపోక ఆ రూమ్ కీ కోసం మళ్లీ స్మశానానికి వెళ్తారు. కానీ అక్కడ అప్పటికే పోలీసులు ఉంటారు. సమాధుల నుంచి శిలువలు తీసిన వారిని ప్రేతాత్మలు వెంటాడి వేధిస్తాయని అక్కడ ఉన్న చర్చి ఫాదర్ చెప్పిన మాటలు విని వీరిద్దరూ వణికిపోతారు.
అనుకున్నట్టుగానే, ఆ క్షణం నుంచి ఐదు ప్రేతాత్మలు డాన్స్ ట్రూప్ దుస్తుల్లో ధనుష్, ఖాజాలను వెంటాడటం మొదలుపెడతాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి వారు పారా సైకాలజిస్ట్ ‘నకుల్’ను కలుస్తారు. కానీ ఆ దెయ్యాల వల్ల నకుల్‌కు కూడా భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. చివరకు వీరంతా ఫాదర్‌ను ఆశ్రయించగా.. 30 ఏళ్ల క్రితం నాటి ఆ సమాధులు ఎవరివో తెలుసుకుని, వారి బంధువుల చేతే మళ్లీ ఆ శిలువలను సమాధులపై ఉంచాలని ఫాదర్ చెబుతాడు. అసలు ఆ ఐదుగురు ఎవరు? వారు ఎలా చనిపోయారు? వారి చావుకు కారణమైన వారెవరు? ఆ ప్రేతాత్మల నుంచి హీరో బృందం ఎలా బయటపడింది? అనేదే మిగతా కథాంశం.
కథ విశ్లేషణ
సినిమా ప్రథమార్ధం (ఫస్టాఫ్) అంతా సమాధుల నుంచి ప్రేతాత్మలు బయటకు రావడం, అవి హీరో వెనుక పడటంతో సాగుతుంది. ఇక ద్వితీయార్ధం (సెకండాఫ్) లో ఆ దెయ్యాల నుంచి తప్పించుకోవడానికి హీరో, అతని లవర్ పింకీ, పారా సైకాలజిస్ట్ నకుల్ చేసే ప్రయత్నాలు, అసలు ఆ దెయ్యాల ఫ్లాష్‌బ్యాక్ ఏంటనే కోణంలో సాగుతూ క్లైమాక్స్ దిశగా పరుగెడుతుంది.
ఇది ఒక ‘మ్యూజికల్ హారర్ కామెడీ’ అని చిత్రబృందం ప్రచారం చేసినప్పటికీ.. సినిమాలో ఎక్కడా సరైన హారర్ ఎలిమెంట్స్ గానీ, కడుపుబ్బా నవ్వించే కామెడీ గానీ వర్కవుట్ కాలేదు. ప్రేతాత్మలు విచిత్రమైన డాన్స్ కాస్ట్యూమ్స్‌తో తెరపైకి రావడం వల్ల అటు భయం, ఇటు హాస్యం రెండూ పండకుండా పోయాయి. దెయ్యాలు ఎందుకు చనిపోయాయి అనే ఫ్లాష్‌బ్యాక్ ఏదైనా బలంగా ఉంటుందేమో అని ఆశతో కూర్చునే ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. ఆ ఫ్లాష్‌బ్యాక్ సీన్లు కూడా చాలా సాదాసీదాగా, ఎలాంటి బలం లేకుండా సాగిపోతాయి.
నటన
నటీనటుల విషయానికి వస్తే, ఎవరి పాత్రలు కూడా గుర్తుంచుకునే స్థాయిలో బలంగా డిజైన్ చేయలేదు. శ్రీనాథ్ భాసి, ఫెమీనా జార్జ్ తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా బబ్లూ అజూ ఫోటోగ్రఫీ ఫరవాలేదనిపిస్తుంది. సామ్ సీఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (నేపథ్య సంగీతం) కొన్ని చోట్ల సీన్లను, డైలాగులను మించి మరీ లౌడ్‌గా వినిపిస్తుంది. నిధిన్ రాజ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా ఉంది.
ముగింపు
‘కరక్కం’ చాలా బలహీనమైన కంటెంట్‌తో, కథాకథనాలపై ఎలాంటి కసరత్తు లేకుండా రూపొందిన చిత్రం. హారర్ కామెడీ సినిమాలను ఇష్టపడే వారికి కూడా ఈ సినిమా నిరాశనే మిగులుస్తుంది. సిల్లీ సీన్లతో సాగే ఈ సినిమా ఓటీటీలో టైమ్ పాస్ చేయడానికి కూడా కాస్త కష్టమే!

