Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఎట్టకేలకు జాతీయ నాయకత్వం దృష్టికి చేరింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వస్తున్న తరుణంలో, మంత్రి కొండా సురేఖ బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను నేరుగా కలిశారు.
పార్టీలో పెరుగుతున్న అంతర్గత ఒత్తిడి, సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

అధిష్ఠానానికి మంత్రి కొండా సురేఖ వివరణ
సుమారు 15 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో కొండా సురేఖ తన వాదనను ఖర్గే ముందు స్పష్టంగా వినిపించారు. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ, గాంధీ కుటుంబానికి గానీ వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఆమె వివరించారు. కేబినెట్ నుంచి తనను తొలగించేందుకు పార్టీలోని కొందరు నేతలు పథకం ప్రకారం కుట్ర పన్నుతున్నారని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె ఏఐసీసీ అధ్యక్షుడిని కోరినట్లు సమాచారం.
Konda Surekha: పార్టీ క్రమశిక్షణపై ఖర్గే స్పష్టత, పెరుగుతున్న రాజకీయ వేడి
పార్టీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా ఖర్గే సురేఖకు హితవు పలికినట్లు తెలిసింది. టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఏఐసీసీ ఎన్నికల కమిటీ పరిధిలోని అంశమని, వాటిపై ఎవరూ ఏకపక్ష ప్రకటనలు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. పరకాల నియోజకవర్గ అభ్యర్థిత్వంపై కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల దుమారం, టీపీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చిన వాతావరణంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
నామినేటేడ్ పోస్టులకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చిన మహేశ్ గౌడ్

