Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ తన 137వ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ముంబైకి చెందిన కృష్ణ శేషాద్రి అనే యువకుడు అభివృద్ధి చేసిన 'BharatRajya' అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆయన ఎంతో అభినందించారు.
ఈ ఆన్‌లైన్ వేదిక ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ఎవరైనా సరే ఒక నిర్దిష్ట సంవత్సరాన్ని ఎంచుకుంటే చాలు.. ఆ కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాలను ఏయే రాజులు లేదా రాజ్యాలు పాలించాయో ఇట్టే తెలుసుకోవచ్చు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతను జోడించి చరిత్రను వినూత్నంగా అందించే ఇలాంటి ప్రయత్నాలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని మోదీ కొనియాడారు.

యువతలో నూతన ఆలోచనలకు మోదీ ప్రోత్సాహం
దేశంలోని యువత కేవలం ఉద్యోగాల వైపే కాకుండా వినూత్నమైన సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వస్తున్నారని ప్రధాని తెలిపారు. చిన్న స్థాయి ఆలోచన అయినప్పటికీ, దానికి సరైన కృషి తోడైతే అది సమాజంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ, ఎంటర్‌ప్రైజెసెస్, సామాజిక సేవ వంటి రంగాల్లో యువత చూపుతున్న చొరవ అభినందనీయమని, ఇది పదిమందికి స్ఫూర్తినిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Narendra Modi: 'డ్రగ్-ఫ్రీ ఇండియా' కోసం సామూహిక పోరాటం
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత కీలకమని, అందుకే వారిని మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మోదీ పిలుపునిచ్చారు. 'మాదకద్రవ్యాల రహిత భారత్' ఆశయం నెరవేరాలంటే కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాకుండా ప్రజలందరూ ఏకమై శ్రమించాలని కోరారు. ముఖ్యంగా నేటి యువత, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు ఈ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగస్వాములులై చైతన్యం తేవాలని ఆయన సూచించారు.
'వోకల్ ఫర్ లోకల్' మంత్రం – స్వదేశీ ఉత్పత్తులకు పెద్దపీట
స్థానిక ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో స్వదేశీ వస్తువుల వాడకం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని గుర్తుచేశారు. మనం కొనుగోలు చేసే ప్రతీ స్వదేశీ వస్తువు వెనుక స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, చిన్నతరహా పరిశ్రమల శ్రమ దాగి ఉంటుందని చెప్పారు. అందుకే ప్రజలు స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని 'వోకల్ ఫర్ లోకల్' నినాదాన్ని మరోసారి గుర్తుచేశారు.
ప్రతి ఒక్కరి బాధ్యతగా పరిశుభ్రత
పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వం లేదా మున్సిపాలిటీల బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతీ పౌరుడి నైతిక కర్తవ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆ ప్రాంతం యొక్క రూపురేఖలతో పాటు మన జీవన ప్రమాణాలు కూడా మారుతాయని తెలిపారు. మొత్తంగా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో సాంకేతికత, యువశక్తి, ఆరోగ్యం, స్వదేశీ సంస్కృతి మరియు పరిశుభ్రత అంశాలకు మోదీ పెద్దపీట వేశారు.

