Telugu: దేశభాషలందు తెలుగు లెస్స' అని గర్వంగా చెప్పు కునే తెలుగు సమాజం నేడు ఒక చేదు నిజాన్ని ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పదో తరగతి ఫలితాలు వెలువడిన ప్రతిసారి గణితం, సైన్స్ వంటి కఠినమైన సబ్జెక్టుల కంటే తెలుగులోనే ఎక్కువ మంది విద్యార్థులు విఫలమవు తున్న దృశ్యం కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఈసారి తప్పిన విద్యార్థుల్లో దాదాపు 41.3 శాతం మంది కేవలం తెలుగులోనే తడబడ్డారంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతుంది. తెలంగాణ లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించడం మరింత కలవ రపెడుతోంది. ఇది కేవలం పరీక్షల మార్కుల సమస్యకాదు. ఇది ఒక భాష, ఒక సంస్కృతి, ఒక జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. మాతృభాషపై పిల్లలకు పట్టు తగ్గిపోవడం అంటే వారి ఆలోచనా విధానం, భావ వ్యక్తీకరణ, సంస్కృతి మూలాలపై ప్రభావం పడటమే. తెలుగు నేలపై తెలుగు భాషే క్రమంగా పరాయి అవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆంగ్ల మాధ్యమంపై పెరిగిన మోజు.
Read Also: NEET UG 2026 Re-exam: నీట్ అభ్యర్థులకు అలర్ట్.. జూన్ 21న మళ్లీ పరీక్ష!
Telugu
Telugu : మాతృభాషతో సహజ అనుబంధం
నేటి తల్లిదండ్రుల్లో చాలామంది పిల్లల భవిష్యత్తు పూర్తిగా ఇంగ్లీష్పైనే ఆధారపడి ఉందని నమ్ముతున్నారు. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇంట్లో కూడా తెలుగుకు బదు లుగా ఇంగ్లీష్ మాట్లాడాలని ప్రోత్సహించడం వల్ల పిల్లలకు మాతృభాషతో సహజ అనుబంధం తగ్గిపోతోంది. మరోవైపు విద్యావ్యవస్థలో కూడా తెలుగు బోధనకు ప్రాధాన్యం తగ్గు తోంది. అనేక పాఠశాలల్లో తెలుగును కేవలం పరీక్ష కోసం చదివే ఒక సబ్జెక్టుగా మాత్రమే చూస్తున్నారు. భాషపై ప్రేమ పెంచేలా బోధన జరగడం తగ్గిపోయింది. పద్యాల సౌందర్యం, కథలలోతు, తెలుగు సాహిత్యంలో ఉన్న మానవీయ విలువలు విద్యార్థుల మనసులను తాకే విధంగా బోధించే పరిస్థితులు క్రమంగా కను మరుగవుతున్నాయి. డిజిటల్ యుగం ప్రభావం కూడా ఈ పరిస్థితిని మరింత తీవ్రమైంది చేసింది. పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, వెబ్ సిరీస్లు, వీడియో గేమ్లతో గడుపుతున్నారు. అందులో ఎక్కువ కంటెంట్ ఇంగ్లీష్ లేదా హిందీలో ఉండటంతో తెలుగు చదివే అలవాటు తగ్గిపోతోంది. ఒక ప్పుడు ఇంటింటా కనిపించిన చందమామ, బాలమిత్ర, వార పత్రికలు ఇప్పుడు పిల్లల చేతుల్లో కనిపించడం అరుదైపో యింది.
భాషపై గౌరవం ఇంట్లోనే పెరుగుతుంది
మాతృభాష అనేది కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాదు. అది మన సంస్కృతి, భావోద్వేగాలు, సంప్రదాయాల నిలయం. పిల్లలు తమ మాతృభాషలో బలంగా ఉంటేనే ఆలోచనా సామర్థ్యం, సృజనాత్మకత మెరుగుపడుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు కూడా తమ మాతృభాషలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. జపాన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు తమ భాషలద్వారానే సాంకేతికంగా ఎదిగాయి. కానీ మనం మాత్రం ఇంగ్లీష్ లేకుంటే భవిష్యత్తే లేదన్న భావనలో మునిగిపోతున్నాం. తెలుగు భాషపై పట్టు కోల్పోతున్న విద్యార్థులు క్రమంగా తెలుగు సాహిత్యం నుంచి కూడా దూరమవుతున్నారు. గురజాడ, శ్రీశ్రీ, విశ్వనాథ, సినారె, దాశరథి వంటి మహా కవుల ఆలోచనలను ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోతున్నారు. భాషను కోల్పోవడం అంటే చరిత్రను, మూలాలను కోల్పోవడమే. ఈ పరిస్థితిని మార్చడం అసాధ్యం కాదు. కానీ అందుకు కుటుంబం, పాఠశాల, ప్రభుత్వం, అందరూ కలిసి కృషి చేయాలి. మార్పుమొదట ఇంటినుంచే ప్రారంభంకావాలి. తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులో మాట్లా డాలి. తెలుగు కథలు చెప్పాలి. పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి. భాషపై గౌరవం ఇంట్లోనే పెరుగుతుంది.
Telugu
మాతృభాషను మరిచిపోవడం అభివృద్ధి కాదు
పాఠశా లల్లో తెలుగు బోధనను మరింత ఆసక్తికరంగా మార్చాలి. కథా వేదికలు, పద్యపఠనాలు, వ్యాసరచన పోటీలు, నాటి కలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో భాషపై మమకారం పెంచాలి. తెలుగు ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వం కూడా మాతృభాష పరిరక్షణపై స్పష్టమైన విధానాలు అమలు చేయాలి. తెలుగు భాషలో డిజిటల్ కంటెంట్ను పెంచాలి. పిల్లలకు నచ్చే యానిమేష న్లు, యాప్లు, ఈబుక్స్, ఆడియో కథలు అందుబాటులోకి తేవాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజా వ్యవహారాల్లో తెలుగుకు మరింత ప్రాధాన్యం కల్పించాలి. మీడియా కూడా తన బాధ్యతను గుర్తించాలి. టెలివిజన్, యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల్లో నాణ్యమైన తెలుగు కార్యక్రమా లు పెరగాలి. తెలుగు మాట్లాడితే వెనుకబాటు అనే అపో హను సమాజం పూర్తిగా తొలగించాలి. ఒక భాష చనిపో వడం అంటే కేవలం కొన్ని పదాలు మాయమవడం కాదు. ఒక జాతి ఆత్మ నిశ్శబ్దం కావడం. తెలుగు వంటి సుసం పన్నమైన భాష మన చేతుల్లోనే బలహీనపడటం నిజంగా బాధాకరం. పదో తరగతి ఫలితాలు మనకు ఒక హెచ్చరిక గంటలా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మేలుకోకపోతే రాబో యే తరాలు తెలుగును కేవలం ఒక సబ్జెక్టుగా మాత్రమే చూసే ప్రమాదం ఉంది. ఇంగ్లీషు నేర్చుకోవడం అవసరం. కానీ మాతృభాషను మరిచిపోవడం అభివృద్ధి కాదు. ప్రపం చంతో పోటీ పడే సామర్థ్యాన్ని ఇంగ్లీష్ ఇస్తే, మనసుకు మూలాలు ఇచ్చేది మాత్రం మాతృభాషే. తెలుగు బతికితేనే తెలుగు సంస్కృతి బతుకుతుంది. తెలుగు నిలిస్తేనే మన ఆత్మగౌరవం నిలుస్తుంది. అందుకే ప్రతి తెలుగు మనిషి తనలో తాను ఒక ప్రశ్న వేసుకోవాలి. మన పిల్లలకు ఆస్తులు ఇస్తున్నాం, కానీ అమ్మ భాషను అందిస్తున్నామా? అని.
-తిప్పర్తి శ్రీనివాస్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

