Chaganti Koteswara Rao: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ఉండవల్లిలోని మంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా నేటి విద్యా రంగంలో నైతిక విలువల అవసరంపై, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే మార్గాలపై ఇరువురి మధ్య విస్తృతంగా చర్చలు సాగాయి.

నైతిక విద్యతోనే విద్యార్థులలో సంపూర్ణ వికాసం
ఈ సమావేశంలో చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా మార్చాలంటే కేవలం చదువు మాత్రమే సరిపోదని, నైతిక విలువలతో కూడిన విద్య ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. బాల్యం నుంచే పిల్లలలో క్రమశిక్షణ, మానవతా విలువలు, పెద్దల పట్ల గౌరవం వంటి గుణాలను పెంపొందించాల్సిన అవశ్యకతను ఆయన మంత్రికి వివరించారు. విద్యార్థులు మార్కులకే పరిమితం కాకుండా సర్వతోముఖాభివృద్ధి సాధించేలా విద్యా విధానం ఉండాలని సూచించారు.
Chaganti Koteswara Rao: ‘నో బ్యాగ్ డే’లో నైతిక విలువల పాఠాలు
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మార్గదర్శకత్వంలో రూపొందించిన నైతిక విలువల పాఠ్యాంశాలను ‘నో బ్యాగ్ డే’ సందర్భంగా విద్యార్థులకు బోధిస్తున్న విషయం విదితమే. సమాజంలో మార్పు రావాలంటే విద్య ద్వారానే సాధ్యమని నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వ కృషితో తాను భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉందని చాగంటి ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. భేటీ అనంతరం మంత్రి నారా లోకేశ్ అత్యంత వినయపూర్వకంగా చాగంటి గారిని కారు వరకు వచ్చి సాగనంపడం విశేషం.
Epaper: epaper.vaartha.com

