Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యల వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ నాయకత్వంపై ఆమె చేసిన కామెంట్స్ దుమారం రేపడంతో, వివరణ ఇచ్చుకునేందుకు ఆమె ఢిల్లీకి వెళ్లారు.
అయితే, అక్కడ ఆమెకు అనుకూల వాతావరణం లభించలేదు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నామమాత్రంగా మాట్లాడి పంపించేయడంతో ఆమె తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆమె మరింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డితో పాటు నేతల ఢిల్లీ భేటీ
మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో వరుస సమావేశాలు నిర్వహించారు. కొండా సురేఖ ఉదంతాన్ని కేవలం అంతర్గత చర్చగా కాకుండా తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని ఆయన గట్టిగా కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Konda Surekha: కేబినెట్ ప్రక్షాళన మరియు నామినేటెడ్ పదవులపై కసరత్తు
ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు కావస్తున్న తరుణంలో మంత్రివర్గ ప్రక్షాళనకు అనుమతించాలని సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్‌ను కోరారు. ఈ భేటీలో కేబినెట్ మార్పులతో పాటు మంత్రి పదవులను ఆశిస్తున్న ఆశావాహుల జాబితా, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలపై అధిష్ఠానంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ప్రక్షాళన ఉండనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
త్వరలోనే మంత్రివర్గం నుంచి ఉద్వాసన?
ఈ నెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని, అదే సమయంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి పూర్తిగా బర్తరఫ్ చేయాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరిస్థితులను బట్టి ఏ క్షణంలోనైనా ఆమెకు ఉద్వాసన పలికే అవకాశం ఉందనే వార్తలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
Epaper: epaper.vaartha.com

