Vijay CM : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చెక్ పెడుతూ తమిళగ వెట్రి కళగం వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు సి.
జోసెఫ్ విజయ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
గత కొన్ని రోజులుగా కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు శనివారం రాత్రి తెరపడింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీకి కొన్ని స్థానాలు తక్కువయ్యాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మద్దతు ప్రకటించడంతో విజయ్ నేతృత్వంలోని కూటమి బలం మెజారిటీ మార్కును దాటింది.
ఆదివారం ఉదయం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత మధ్యాహ్నం కార్యక్రమం నిర్వహించాలని భావించినప్పటికీ, చివరికి ఉదయం పది గంటలకు వేడుకను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రత్యేకంగా ఈ వేడుకకు రానున్నట్లు సమాచారం. విజయ్‌తో పాటు టీవీకేకు చెందిన పలువురు సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Read Also : తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. అతిథుల జాబితాలో ప్రముఖులు!
Vijay CMవిజయ్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో చెన్నై నగరంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్ద ఉదయం నుంచే అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయ్ అభిమానులు ఆయన ఫొటోలతో ఉన్న కండువాలు, బ్యాడ్జీలు, పోస్టర్లతో సందడి చేస్తున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో విజయ్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సీఎం ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు గంటల ముందే క్యూ కడుతున్నారు.
ఇక అసెంబ్లీలో మే పదమూడు లోపు కొత్త ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు డీఎంకే పార్టీ అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ప్రకటించింది. తమిళనాడు ప్రజలు దశాబ్దాల తర్వాత ఒక కొత్త రాజకీయ శక్తికి అధికారం అప్పగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు విజయ్ పాలన ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

