Plastic Currency : ఇటీవల భారత ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ, ప్రస్తుతం చెలామణిలో ఉన్న కాగితపు 10, 20 రూపాయల నోట్లకు అదనంగా పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రయో గాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయిం చింది.
ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్ డమ్, సింగపూర్ వంటి అనేక దేశాలు పాలిమర్ నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఎక్కువకాలం మన్నడం, నీటికి తడవకపోవడం, అనుకరణ మరింత కష్ట తరం వంటి ప్రయోజనాల వల్ల ఈ మార్పు ప్రపంచవ్యాప్తం గా వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో మట్టి టోకెన్ల నుంచి ప్లాస్టిక్ నోట్ల వరకు సాగిన ఈ ఐదు వేల ఏళ్ల కరెన్సీ ప్రయాణాన్ని సింహావలోకనం చేసుకోవడం ఆసక్తి కరంగా ఉంటుంది. నాగరికత ప్రారంభంలో ప్రపంచమంతా వస్తు మార్పిడి (బార్డర్) పద్ధతిపైనే ఆధారపడేది. కరెన్సీ అవసరం లేకుండానే, లావాదేవీల నికర విలువ ఆధారంగా వస్తుమార్పిడి జరిగేది, అయితే ఈ విధానంలో ఆర్థికశాస్త్రం లో ‘డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్’ గా పిలిచే ఒక ప్రధాన సమస్య ఎదురయ్యేది. ఒకే సమయంలో ఇరువురికీ అవతలి వ్యక్తి వద్ద ఉన్న వస్తువే అవసరమై ఉండాలి. ఈ ఇబ్బందే మరింత సమర్థవంతమైన మార్పిడి వ్యవస్థ అవస రాన్ని సృష్టించి, కరెన్సీ పుట్టుకకు నాంది పలికింది. ఆసక్తి కరంగా, వస్తు మార్పిడి సూత్రం పూర్తిగా కనుమరుగై పోలేదు. నేటికీ స్టాక్ ఎక్స్చే ంజీల క్లియరింగ్ వ్యవస్థల్లో, కొన్ని అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల్లో, పరస్పర బాకీల నెట్టింగ్ విధానంలో ఇదే భావన ఆధునిక రూపంలో కనిపిస్తుంది.
Plastic Currency
Plastic Currency : ప్రజాదరణ
లావాదేవీలు చాలావరకూ ఒకదానితో వేరొకటి పరిష్కారం అయిపోగా, నికర విలువ మాత్రమే చేతులు మారుతుంది. సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం మెసపొటేమియాకు చెందిన సుమేరియన్, ఆకా డియన్ నాగరికతల్లో ధాన్యం, నూనె, పశువులు వంటి వస్తువుల విలువను సూచించే మట్టి టోకెన్లు ఒక నిర్దిష్ట విలువను సూచించే ప్రతీకలుగా ఉపయోగించబడేవి. వాణిజ్య లావా దేవీలు, గిడ్డంగి నిల్వలు, పన్నులు మొదలైన వాటి లెక్కల నిర్వహణకు టోకెన్లు ఉపయోగపడేవి. వాస్తవానికి ఈటోకెన్ల ఆధారంగా లావాదేవీలను నమోదు చేయాల్సిన అవసరమే మానవ చరిత్రలో ‘లిపి’ అభివృద్ధికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చరిత్రకారులు భావిస్తున్నారు. అందుకే మట్టి టోకెన్లు తొలినాటి కరెన్సీగా మాత్రమే గాక అకౌంటింగ్, పరిపాలన, నాగరికత పరిణామంలో కూడా ఒక కీలక మైలురాయిగా నిలిచాయి. వాణిజ్యం విస్తరించడంతో మరింత విశ్వసనీయమైన మార్పిడి సాధనం అవసరమైంది. ఫలితంగా బంగారం, వెండి, రాగి వంటి లోహాలతోనాణేలు తయారయ్యాయి. లోహానికి సహజసిద్ధమైన విలువ ఉండ టం, దీర్ఘకాలం మన్నడం వల్ల అవి వేగంగా ప్రజాదరణ పొందాయి.
ద్రవ్య చరిత్రకు నిదర్శనం
భారతదేశం కూడా ఈ రంగంలో అగ్రస్థానం లోనే నిలిచింది. ప్రాచీన పంచ్ మార్క్ నాణేలు, మౌర్యులు, శాతవాహనులు జారీ చేసిన నాణేలు భారతదేశపు సమృ ద్ధమైన ద్రవ్య చరిత్రకు నిదర్శనం. విజయనగరసామ్రాజ్యం జారీ చేసిన బంగారు పగోడా (వరాహ) నాణేలు దక్షిణ భారతదేశంలోనే కాకుండా హిందూ మహాసముద్ర వాణిజ్యం లోనూ విశ్వసనీయ కరెన్సీగా గుర్తింపు పొందాయి. నాణేలు కేవలం లావాదేవీల సాధనాలుగానే కాకుండా, రాజవంశాల కాలక్రమం, పాలకుల పేర్లు, బిరుదులు, మత విశ్వాసాలు, ఆర్ధిక పరిస్థితులను పునర్నిర్మించడంలో చరిత్రకారులకు అమూల్యమైన ఆధారాలుగా ఉపయోగపడ్డాయి. లోహ నాణేలు విశ్వసనీయమైనవే అయినప్పటికీ, వాటిని భారీ సంఖ్యలో ముద్రించడం, రవాణా చేయడం, పెద్ద మొత్తాల లావాదేవీల్లో వినియోగించడం క్రమంగా భారంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో తోలు, వస్త్రం వంటి ప్రత్యామ్నాయాలను పరిమితంగా ఉపయోగించబడ్డాయి. అయితే తక్కువబరువు, తక్కువ ముద్రణా వ్యయం, సులభమైన రవాణా, పెద్ద మొత్తాల చెల్లింపులకు అనుకూలత కారణంగా కాగితపునోట్లు ప్రపంచవ్యాప్తంగా క్రమంగా విస్తరించాయి. ఈ సందర్భం లో, కరెన్సీ దానికి ఆపాదించిన విలువను ఎలా సంతరిం చుకుంటుందనేది ఆసక్తికరమైన అంశం. తొలినాళ్లలో బంగా రం, వెండి నాణేల విలువ వాటిలోని లోహం విలువకు దగ్గరగా ఉండేది. దీనిని అంతర్గత విలువ (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) కలిగిన ద్రవ్యంగా భావించవచ్చు. కానీ, ఉదాహ రణకు ప్రస్తుతం రూ.100 నోటు తయారీ ఖర్చు రూ.100 కాదు. అంత కంటే ఎంతో తక్కువ ఉంటుంది. అంటే, వాటి విలువ లోహంలోనో, కాగితంలోనో లేదు. దానిని జారీ చేసిన ప్రభుత్వం, కేంద్ర బ్యాంకుపై ప్రజలు ఉంచిన విశ్వా సంలో ఉంది.
కరెన్సీ వ్యవస్థలో సంస్కరణలు
ఇలాంటి ద్రవ్యాన్నే టోకెన్కరెన్సీ లేదా ఫిడ్యూ ష యరీ కరెన్సీ అంటారు. ఈవ్యవస్థ అమలులో ఉన్నందు వలన దేశ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ప్రభు త్వాలు కొత్త నోట్లను ప్రవేశపెట్టగలుగుతున్నాయి. పాత నోట్లను ఉపసం హరించుకోగలుగుతున్నాయి. అవసరమైతే కరెన్సీ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టగలుగుతున్నాయి. భారత దేశంలో పెద్ద నోట్లరద్దు, బ్రెజిల్, టర్కీవంటి దేశాల్లో తీవ్ర మైన ద్రవ్యోల్బణం తరువాత చేపట్టిన కరెన్సీ సంస్కరణ లు దీనికి ఉదాహరణలు. ప్రపంచంలో అప్పటికే అమలులో ఉన్న టోకెన్ కరెన్సీ భావనను, భారతదేశంలో అత్యంత సాహసోపేతంగా అమలు చేయడానికి ప్రయత్నించిన పాల కుడు మహమ్మద్ బిన్ తుగ్లక్. 14వ శతాబ్దంలో ఆయన వెండి నాణేలకు ప్రత్యామ్నాయంగా రాగి, ఇత్తడితో టోకెన్ కరెన్సీని హడావిడిగా ప్ర వేశపెట్టాడు. అయితే నకిలీనాణేలను అరికట్టే సాంకేతికత, కఠిన నియంత్రణ వ్యవస్థలు లేకపోవ డంతో ప్రజలు పెద్దఎత్తున నకిలీనాణేలను తయారుచేశారు. ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తమై, చివరకు తుగ్లక్ తన ప్రయోగాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. కానీ తుగ్లక్ ప్రయోగం టోకెన్ కరెన్సీ విజయవంతం కావాలంటే ప్రజల విశ్వాసాన్ని కాపాడగల సాంకేతికత, సమర్థమైన పరిపాలనా వ్యవస్థ అవసరమనే విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది. మన్నిక, పరిశుభ్రత, నకిలీ నిరోధకత వంటి అంశాల్లో కాగి తపు నోట్లు ఎదుర్కొంటున్న పరిమితులను అధిగమించేం దుకు అనేకదేశాలు పాలిమర్ (ప్లాస్టిక్)నోట్లను ప్రవేశపెడుతు న్నాయి. ఇవి ఎక్కువకాలం మన్నుతాయి. నీటికి తడవవు.
Plastic Currency
ఎక్కువకాలం మన్న డం
ఆధునిక భద్రతా లక్షణాల వల్ల నకిలీ చేయడం మరింత కష్టతరం. నోట్ల జీవితకాలం పెరగడంతో దీర్ఘకాలంలోముద్రణ వ్యయం కూడా తగ్గేఅవకాశం ఉంటుంది. సాంకేతిక పరి జ్ఞానం మరింత అభివృద్ధి చెందడం, నకిలీ కరెన్సీని అరి కట్టాల్సిన అవసరం పెరగడంవంటి కారణాలతో, ఇంతకు ముందే ప్రతిపాదించిన ఈ ప్రయత్నం మరోసారి ఊపందు కుంది. ‘ప్లాస్టిక్’ అనగానే సహజంగానే పర్యావరణంపై సందే హాలు తలెత్తుతాయి. అయితే, పాలి మర్ నోట్లు కాగితపు నోట్లకంటే రెండు నుంచి నాలుగురెట్లు ఎక్కువకాలం మన్న డం వల్ల కొత్త నోట్ల ముద్రణ, రవాణా, భర్తీ ప్రక్రియలకు అవసరమయ్యే ముడి పదార్ధాలు, ఇంధన వినియోగం తగ్గే అవకాశం ఉంటుంది. వాటిని పునర్వినియోగం చేయడం కూడా సాధ్యమే. అందువల్ల పర్యావరణ ప్రభావాన్ని కేవలం తయారీ పదార్ధం ఆధారంగా కాకుండా, మొత్తం జీవితచక్రం ఆధారంగా అంచనా వేయడం అవసరం. అయితే పాలిమర్ నోట్ల పర్యావరణ ప్రయోజనాలు, వినియోగానంతరం వాటిని సమర్థంగా సేకరించి, పునర్వినియోగం చేయగల వ్యవస్థ ఉన్నప్పుడే పూర్తిగా సాకారమవుతాయి. గతదశాబ్దంలో ప్రపంచం, ముఖ్యంగా భారతదేశం, పెద్దమార్పునుచూసింది, యూపీఐ, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపులు విస్తరించాయి. అయితే ఇవి కొత్త కరె న్సీలుకావు. రూపాయివంటి ప్రస్తుత కరెన్సీలను వినియో గించే కొత్త చెల్లింపు వద్ధతులు మాత్రమే. మట్టి టోకెన్లతో ప్రారంభమైన కరెన్సీ ప్రయాణం లోహ నాణేలు, కాగితపు నోట్లు, ఇప్పుడు పాలిమర్ నోట్లవరకు చేరుకుంది. ప్రతి దశ వెనుక ఒకే లక్ష్యంఉంది. లావాదేవీలను మరింత సురక్షితం గా, సులభంగా, సౌకర్యవంతంగా మార్చడం. రేపు సాంకే తిక పరిజ్ఞానం మరింత ముందుకు వెళితే కరెన్సీ మరోకొత్త రూపాన్ని సంతరించుకోవచ్చు. అందువల్ల పాలిమర్ నోట్లు కరె న్సీ పరిణామానికి చివరి మజిలీకావు, మానవ నాగరికతఆర్ధిక ప్రయాణంలో మరోసహజమైన మైలురాయి మాత్రమే.
-కృష్ణ బాలాజి పల్లపోతు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
పీఎఫ్ ఖాతాదారులకు తీవ్ర హెచ్చరిక.. సైబర్ మోసాలపై EPFO కీలక ప్రకటన!

