Saraswathi Anthya Pushkaralu: సరస్వతీ అంత్య పుష్కరాలాను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
బుధవారం సచివాలయంలోని తన చాంబర్లో ఐటీ, పరిశ్రమలశాఖమంత్రి శ్రీధర్ బాబు తో కలసి సరస్వతి అంత్య పుష్కరాలు పోస్టర్, అధికారిక టీజర్ను ఆవిష్కరించారు.
Saraswati Pushkaram poster unveiled.
Saraswathi Anthya Pushkaralu: పుష్కరాల షెడ్యూల్
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… ఈ సరస్వతీ అంత్య పుష్కరాలను మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు కాళేశ్వరంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పుష్కరాలకు రూ. 30.63 కోట్లతో 162 అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు పుష్కర స్నానం, స్వామి దర్శనం చేసుకొనే విధంగా ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు.
అంత్య పుష్కరాలకు 30 లక్షల భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత సరస్వతి నది పుష్కరాలతోపాటు సమ్మక సారలమ్మ జాతరను అత్యంత ఘనంగా నిర్వహించామని చెప్పారు. ప్రస్తుతం సరస్వతి అంత్య పుష్కరాలు, వచ్చే సంవత్సరం రానున్న గోదావరి పుష్కరాలకు కూడా పనులను కూడా ప్రారంభించామని తెలిపారు.
సమన్వయంతో పనులు పూర్తి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు
అనంతరం.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి. శ్రీధర్బాబు మాట్లాడుతూ… సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులకు విసృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పది రోజుల ముందే పుష్కరాల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య కలగకుండా పోలీసు యంత్రాంగం, ఇతర శాఖల సమన్వయంతో పని చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణానికి రూ. 198 కోట్లను కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు
దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ… పుష్కరాలను మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు కాళేశ్వరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల మొదటి రోజు ఉదయం 5 గంటల 43 నిమిషాలకు ప్రారంభ పుష్కర స్నానాన్ని కంచికామకోటి పీఠాధిపతి శంకర విజేంద్ర సరస్వతీ స్వామి చేస్తారని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ను ఆహ్వానించామన్నారు. ప్రతి రోజు ఒక పీఠాధిపతి ఉదయం పుష్కర స్నానం చేసే విధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. ప్రతి రోజు త్రివేణి సంగమం వద్ద సాయంత్రం 6.30 ఘనంగా కాశి పండితులు హారతి నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, కాళేశ్వర ఆలయ ట్రస్ట్ చైర్మన్ మోహన్ శర్మ, దేవాదాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

