Medak Municipal Petrol Diesel Controversy: మెదక్ : కొత్తగా కొలువుదీరిన ఏ పాలక వర్గం అయినా ప్రజల సొమ్ము ఆదా చేస్తూ మున్సిపల్ ఆదాయం పెంచేందుకు కృషి చేస్తోంది.
అయితే జిల్లా కేంద్రం అయిన మెదక్ మున్సిపల్ కొత్త పాలక వర్గం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ ప్రజలపై అదనపు భారం మోపే తీర్మానాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ వినియోగంలో పెరిగిన భారం
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తూ పొదుపు చర్యలు చేపడుతున్న సమయంలో, మెదక్ మున్సిపల్ మాత్రం గతంలో కంటే అధికంగా ఇంధనం వినియోగిస్తూ ప్రజలపై అదనపు భారం మోపుతోందని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.
మెదక్ మున్సిపల్ పరిధిలో మొత్తం 25 వాహనాలు ఉన్నాయి. వీటిలో చెత్త సేకరణ ట్రాక్టర్లు, ఆటోలు ఉండగా, 22 మంది వార్డ్ అధికారుల బైక్‌లకు కూడా మున్సిపల్ పెట్రోల్ ఖర్చు భరిస్తోంది. వీటన్నింటికీ కలిపి నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతోందని తెలుస్తోంది.
ఎవరి ప్రయోజనం కోసం తీర్మానం?
ఇప్పటి వరకు మున్సిపల్ వాహనాలన్నింటికీ ఆఫీస్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లో ఖాతా ద్వారా ఇంధనం నింపేవారు. అయితే కొత్త పాలక వర్గం రెండో సమావేశంలోనే మాంబోజిపల్లి ప్రాంతంలోని మరో పెట్రోల్ బంక్‌కు ఖాతాను మార్చినట్లు తీర్మానం చేశారు.
కొంత మంది కౌన్సిలర్లు దీనిని వ్యతిరేకించినప్పటికీ, మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించారు. దీంతో ప్రతి వాహనం పెట్రోల్, డీజిల్ కోసం వెళ్లి రావడానికి సుమారు 8 కిలోమీటర్ల అదనపు ప్రయాణం చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.
Medak Municipality: నెలకు రూ.40 వేల వరకు అదనపు ఖర్చు
ట్రాక్టర్లు, ఆటోలు పాత వాహనాలు కావడంతో మైలేజ్ తక్కువగా వస్తోందని, ఈ అదనపు దూరంతో నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు అదనపు ఇంధన ఖర్చు అవుతోందని ఆరోపించారు.ప్రత్యేక పరిస్థితుల్లో ఇంధన వినియోగం మరింత పెరిగితే ప్రజలపై పడే భారం ఇంకా అధికమవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా ఉద్యమం తప్పదన్న మామిళ్ల ఆంజనేయులు
కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజలపై భారాన్ని మోపే ఈ తీర్మానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు."మేము మొదటి నుంచే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాం. అధికార పార్టీ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోం. వెంటనే తీర్మానం రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదు" అని హెచ్చరించారు.
మామిళ్ళ ఆంజనేయులు , కౌన్సిలర్కలెక్టర్ స్పందించాలని బట్టి ఉదయ్ డిమాండ్
కౌన్సిలర్ బట్టి ఉదయ్ మాట్లాడుతూ మున్సిపల్ ఆదాయాన్ని పట్టణ అభివృద్ధికి వినియోగించాల్సిందిపోయి, ఇలా నిధులను దుర్వినియోగం చేయడం సరికాదన్నారు."ప్రజా వ్యతిరేక తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఖర్చులు పెంచుతూ మున్సిపల్ నిధులను వృథా చేయడం తగదు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి" అని కోరారు.
బట్టీ ఉదయ్ , కౌన్సిలర్
Medak Municipal Petrol Diesel Controversy: పెట్రోల్ బంక్ మార్పుపై చైర్పర్సన్ వివరణ
ఈ అంశంపై మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ స్పందిస్తూ, పాత పెట్రోల్ బంక్ వారు బిల్లులు త్వరగా చెల్లించాలని ఒత్తిడి చేయడంతో సౌలభ్యం కోసం మరో బంక్‌కు మార్పు చేశామని తెలిపారు.ప్రతి నెల 15 లేదా 16 తేదీల్లో బిల్లులు చెల్లిస్తామని, అయితే పాత బంక్ వారు 10వ తేదీలోపే చెల్లించాలని ఒత్తిడి చేయడంతో తీర్మానం చేసి మార్పు చేసినట్లు పేర్కొన్నారు.

కొత్త బంక్‌కు ముందుగానే బిల్లుల చెల్లింపు?
అయితే కొత్తగా మార్చిన పెట్రోల్ బంక్‌కు గత నెల 6వ తేదీకే బిల్లులు చెల్లించారని సమాచారం రావడంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పట్టణ పరిధిలో అనేక పెట్రోల్ బంక్‌లు ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా పట్టణ శివారులోని అదే బంక్‌ను ఎంపిక చేయడంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.నిధుల దుర్వినియోగంతో పాటు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ వినియోగంపై జిల్లా కలెక్టర్ స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

