Vaishnav Tej : మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన 'ఉప్పెన' సినిమాతో హీరోగా పరిచయమైన వైష్ణవ్, మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో Vaishnav Tej కెరీర్ వేగంగా ముందుకు సాగుతుందని అంతా భావించారు.
ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో :
‘ఉప్పెన’ తర్వాత వరుసగా పలు సినిమాలు చేసిన వైష్ణవ్ తేజ్, విభిన్న కథలను ఎంచుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో ఆయన కెరీర్ కొంత మందగించింది. ముఖ్యంగా ‘ఆదికేశవ’ సినిమా తర్వాత ఆయన నుంచి కొత్త సినిమా ప్రకటించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ పలువురు దర్శకులు చెప్పిన కథలను వింటున్నప్పటికీ, ఏ కథా తనను పూర్తిగా ఆకట్టుకోలేదని టాక్. ఈసారి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా, బలమైన కథతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత సినిమాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే మెగా హీరో అయ్యుండి ఇంత పెద్ద కెరీర్ గ్యాప్ తీసుకోవడంపై సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొందరు మంచి కథ కోసం ఎదురుచూడటం సరైన నిర్ణయమే అంటుంటే, మరికొందరు ఎక్కువ గ్యాప్ తీసుకుంటే ప్రేక్షకులతో కనెక్షన్ తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ విషయాలపై వైష్ణవ్ తేజ్ లేదా ఆయన టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వినిపిస్తున్నవన్నీ ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారమే. మంచి కథతో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని అభిమానులు మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్పైడర్ మ్యాన్ - బ్రాండ్ న్యూ డే ప్రీమియర్‌లో అల్లు అర్జున్ సందడి..!

