Hyderabad Traffic Restrictions: నగరంలో మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేయనున్న 'జల్సా' కార్యక్రమం నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రధానంగా దారుస్సలాం పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డెవిస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఆగస్టు 26వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు.
Milad-un-Nabi: Traffic restrictions from this evening.
Hyderabad Traffic Restrictions: ట్రాఫిక్ మళ్లింపు వివరాలు
కార్యక్రమ సమయంలొ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి పోలీసులు పలు చోట్ల రూట్ డైవర్షన్లు ఏర్పాటు చేశారు.
- మలక్‌పేట, బేగంబజార్ మార్గం: మలక్‌పేట, బేగంబజార్ ఛత్రీ వైపు నుంచి దారుస్సలాం వైపు వెళ్లే వాహనాలను అలస్కా టీ-జంక్షన్ వద్ద ఎంజే బ్రిడ్జి, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.
- మల్లేపల్లి, బోయిగూడ మార్గం: మల్లేపల్లి ఎక్స్-రోడ్స్, బోయిగూడ కమాన్ మీదుగా దారుస్సలాం వెళ్లే వాహనాలను ఆగాపురా ఎక్స్-రోడ్ వద్ద టక్కర్‌వాడి, చార్మినార్ వైపు పంపిస్తారు.
- బజార్‌ఘాట్, తాజ్ ఐలాండ్ మార్గం: బజార్‌ఘాట్, తాజ్ ఐలాండ్ నుంచి వచ్చే వాహనాలను ఏక్ మినార్ వద్ద మళ్లించి, నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు వైపు పంపుతారు.
- మెహిదీపట్నం, ఆసిఫ్ నగర్ మార్గం: మెహిదీపట్నం, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే ప్రయాణికులు మల్లేపల్లి ఎక్స్-రోడ్స్ నుంచి గోకుల్ నగర్, బజార్‌ఘాట్ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు
జల్సా కార్యక్రమానికి హాజరయ్యే భక్తులు, సందర్శకుల సౌకర్యార్థం పోలీసులు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సీతారాంబాగ్ ప్రభుత్వ డిస్పెన్సరీ మైదానం, రాకెట్ గ్రౌండ్‌లలో కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలను పార్క్ చేయాలి. బైక్‌లు, స్కూటర్ల కోసం ఆఘా దర్గా, సర్దార్ బేగ్ దర్గా, పాన్ మండి రోడ్, ఎస్‌బీఐ రోడ్డు ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఈ ట్రాఫిక్ మార్పులను గమనించి, పోలీసుల సూచనలను పాటిస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు నగర ప్రజలందరూ సహకరించాలని జాయింట్ సీపీ విజ్ఞప్తి చేశారు.

