Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో జరిగిన ఒక ముఖాముఖి (ఇంటరాక్షన్) కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
తన కుమారుడు దేవాన్ష్, తానూ తండ్రీకొడుకుల్లా కాకుండా ఎప్పుడూ అన్నదమ్ముళ్లలా సరదాగా కొట్టుకుంటూ ఉంటామని నవ్వుతూ చెప్పారు. దేవాన్ష్ విషయాల్లో తాను పెద్దగా జోక్యం చేసుకోనని, అతనికి ఎలాంటి సలహాలు (అడ్వైజ్లు) కూడా ఇవ్వనని లోకేష్ వెల్లడించారు. బాబు చదువు, క్రమశిక్షణ వంటి బాధ్యతలన్నింటినీ భార్య బ్రాహ్మణియే పూర్తిగా చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో దేవాన్ష్ చెస్ (చదరంగం) ఆడే అలవాటు గురించి ప్రస్తావిస్తూ.. ఒకవేళ వాడు చెస్ ఆటలో ఓడిపోతే మాత్రం ఇంట్లో తమ పరువంతా పోయినట్లు ఫీలవుతామంటూ లోకేష్ చేసిన ఫన్నీ కామెంట్స్ అక్కడ నవ్వులు పూయించాయి.

విద్యా వ్యవస్థలపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇదే సదస్సులో విద్యార్థులతో తన చదువు నాటి జ్ఞాపకాలను పంచుకుంటూ విద్యా వ్యవస్థలపై లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భారతీయ విద్యా వ్యవస్థ (ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్) కంటే అమెరికా విద్యా వ్యవస్థలోనే ఎక్కువ విజయవంతమయ్యానని ఓపెన్‌గా అంగీకరించారు. భారతీయ చదువుల్లో ఉండే ఒత్తిడి, కేవలం మార్కుల కోసమే చదివే పద్ధతి కంటే.. ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆలోచనా శక్తికి ప్రాధాన్యతనిచ్చే అమెరికన్ విద్యా విధానం తనకు బాగా సూట్ అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, నైపుణ్యాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన తన సొంత అనుభవాన్ని ఇక్కడ ఉదాహరణగా వివరించారు.

