Modi : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ఎవరితో పెట్టుకోకూడదో, ఆ 'జెన్ జెడ్' (Gen Z) యువతతోనే పెట్టుకుని పెద్ద తప్పు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన పోరాటాన్ని ప్రస్తావిస్తూ… అది ఒకవైపు ‘వాట్సాప్ అంకుల్స్’, మరొకవైపు ‘ఇన్‌స్టాగ్రామ్ పిల్లల’ మధ్య జరిగిన హోరాహోరీ యుద్ధంగా అభివర్ణించారు. యువత నుంచి వచ్చిన తీవ్రమైన నిరసనలు, డిజిటల్ ఒత్తిడి తట్టుకోలేక, పాలకులకు అర్ధరాత్రి వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

సోషల్ మీడియా తోనే జవాబుదారీతనం: రాబోయే ఎన్నికల్లో జెన్ జెడ్‌దే హవా
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా గనుక లేకపోతే రాజకీయ నాయకుల్లో జవాబుదారీతనం వచ్చేదే కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. నేటి తరం యువత సుదీర్ఘమైన వార్తల కంటే రీల్స్, షార్ట్ వీడియోల రూపంలోనే రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ అవగాహన పెంచుకుంటున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో దేశంలో 50 శాతానికి పైగా ఓటర్లు జెన్ జెడ్ యువతే ఉంటారని, వీరే ప్రభుత్వాల జాతకాలను మార్చే నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నారని చెప్పారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న యువతను తక్కువగా అంచనా వేస్తే ఏ ప్రభుత్వానికైనా తిప్పలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు.

