Bhogapuram Airport : భోగాపురం సభా వేదికపై పవన్ కల్యాణ్ అత్యంత ఎమోషనల్‌గా ప్రసంగించారు. జంతర్ మంతర్ వద్ద ప్రధాని మోదీని ఉద్దేశించి కొందరు అనకూడని మాటలు అంటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
దేశం కోసం అహర్నిశలు కష్టపడే ఒక మహోన్నత నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. “మోదీ గారు పడ్డ కష్టం ఈనాటి కొత్త తరానికి ఏం తెలుసు? ఆయనపై పడిన ప్రతి మాట మా మనసును గాయపరిచింది. మోదీని రాజకీయంగా కొట్టే నాయకుడు దేశంలో లేడు, రాబోడు. అంతగా తిట్టిన వారిని కూడా తన పెద్ద మనసుతో క్షమించిన ప్రధాని మోదీ గారి పాదాలకు నమస్కరిస్తున్నాను” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం రూ. లక్షల కోట్ల కేటాయింపులు - ప్రధాని మోదీ యుగపురుషుడు
భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీని ‘యుగపురుషుడు’గా, ‘నవ భారత్ అభివృద్ధి రూపశిల్పి’గా పవన్ కల్యాణ్ అభివర్ణించారు. 140 కోట్ల మంది ప్రజల ఆశయాలను ఆయన సాకారం చేస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని చెబుతూ.. విశాఖ కేంద్రంగా రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు, అమరావతి రాజధాని నిర్మాణానికి రూ. 50 వేల కోట్లు, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి రూ. 13,400 కోట్లను కేటాయించారని వెల్లడించారు. మోదీ నేతృత్వంలో, సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఏపీ ప్రగతి పథంలో దూసుకుపోతోందని ఆయన స్పష్టం చేశారు.
తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణికులు: ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయిలో సర్వీసులు!

