Mudragada Died : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో కాకినాడ జిల్లా కిర్లంపూడికి చేరుకోనున్నారు.
నిన్న అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ రాజకీయవేత్త, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని సందర్శించి ఆయన ఘన నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ కుటుంబ సభ్యులను, ఆయన కుమారుడు గిరిబాబును వ్యక్తిగతంగా పరామర్శించి, ఈ కష్టసమయంలో వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయనున్నారు. ముద్రగడ మరణవార్త తెలియగానే నిన్న రాత్రి జగన్ ఫోన్ ద్వారా ఆయన కుమారుడితో మాట్లాడి ధైర్యం చెప్పినప్పటికీ, నేరుగా తరలివచ్చి కడసారి చూపు చూసుకునేందుకు కిర్లంపూడి ప్రయాణమయ్యారు.

భావోద్వేగానికి లోనైన జగన్
ముద్రగడ పద్మనాభం మృతి తనను వ్యక్తిగతంగా తీవ్రంగా కలచివేసిందని వైఎస్ జగన్ సామాజిక మాధ్యమాల వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ తనకు పితృసమానులని, ఆత్మగౌరవానికి మరియు నిబద్ధత కలిగిన రాజకీయాలకు ఆయన నిలువెత్తు రూపమని కొనియాడారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ముద్రగడ క్రమంగా కోలుకుంటున్నారని, త్వరలోనే మళ్లీ తమ మధ్యకు వస్తారని ఆశించామని.. కానీ ఇంతలోనే ఈ విషాద వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. జీవితాంతం పేదల సంక్షేమం కోసం, కాపు సామాజికవర్గ హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ముద్రగడ మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను నమ్మిన లక్షలాది మంది అభిమానులకు తీరని లోటని జగన్ ఎమోషనల్ అయ్యారు.
కిర్లంపూడిలో ఉద్రిక్తత.. తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన క్రాంతి ని అడ్డుకున్న తల్లి

