CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థరాత్రి ముంబై చేరుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు.
ఈ బృందం నేడు ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న బ్యారేజ్ ఎత్తు పెంపు అంశంపై చర్చించనున్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన 148 మీటర్ల ఎత్తును 150 లేదా 152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడమే తెలంగాణ బృందం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
revanth reddy advises farmers avoid paddy yasangi seasonసాగునీటి ప్రయోజనాలపై తెలంగాణ ఆశలు
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలకమైన ప్రాజెక్టుగా భావిస్తున్నారు. బ్యారేజ్ ఎత్తును పెంచే ప్రతిపాదనపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏకాభిప్రాయం సాధించడం ద్వారా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలను ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే బ్యారేజ్ ఎత్తు పెంపుపై తుది నిర్ణయం తీసుకోవడానికి సాంకేతిక అంశాలు, నీటి లభ్యత, అంతర్రాష్ట్ర సమన్వయం వంటి అంశాలు కీలకం కానున్నాయి. రేవంత్ రెడ్డి, ఫడణవీస్ మధ్య జరిగే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తే ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి చర్యలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది.

