Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజం శస్త్రచికిత్స కోసం ముంబై వెళ్లారు. ప్రజాసేవలో భాగంగా గత కొంతకాలంగా తీవ్రమైన భుజం నొప్పిని భరిస్తూనే ఆయన ముందుకు సాగారు.
నిజానికి గత వారమే శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు స్పష్టం చేసినప్పటికీ, ముందే ఖరారైన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే వస్తానని ఆయన వైద్యులకు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం బాధ్యతలను పూర్తి చేసుకుని, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.

గాయాలకు కారణాలు.. కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స
సినీ రంగంలో హీరోగా కఠినమైన యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం, రాజకీయాల్లోకి వచ్చాక నిరంతరం ప్రజల్లో పర్యటించడం, భారీ జనాల మధ్య ఒత్తిడికి గురికావడం వంటి కారణాల వల్ల పవన్ కళ్యాణ్ భుజాలు గాయపడ్డాయి. గత వారం ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా.. రొటేటర్ కఫ్‌తో పాటు రెండు భుజాల కండరాలు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే శస్త్రచికిత్స నిమిత్తం ఆయన హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకోనున్నారు.
Pawan Kalyan: సర్జరీ తర్వాత ఐదు రోజుల పాటు విశ్రాంతి
ఈ ఆపరేషన్ ముగిసిన అనంతరం వైద్యుల పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ ఐదు రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి, తిరిగి ఎప్పటిలాగే ప్రభుత్వ విధుల్లో పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం. పవన్ కళ్యాణ్ సర్జరీ విజయవంతం కావాలని, ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా క్షేత్రంలోకి రావాలని అభిమానులు, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ప్రార్థిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

