Bandi Sanjay: కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో పెద్ద ఊరట లభించింది. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై నమోదైన ఒక పాత క్రిమినల్ కేసును కోర్టు పూర్తిగా కొట్టివేసింది.
ఈ కేసుపై సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం న్యాయస్థానం ఈ కీలక తీర్పును వెలువరించింది.

అసలు వివాదం ఏంటి? బండి సంజయ్ పై కేసు ఎందుకు పెట్టారు?
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన సమయంలో రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కాయి. ఆ సమయంలో ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్.. అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ ఓటుకు రూ.25 వేల చొప్పున పంపిణీ చేస్తోందని విమర్శించారు. అంతటితో ఆగకుండా.. అందులో కేవలం రూ.5 వేలు మాత్రమే ఓటర్ల చేతుల్లో పెట్టి, మిగిలిన రూ.20 వేలను ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తలే మధ్యలోనే నొక్కేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారాన్ని రేపాయి. బండి సంజయ్ చేసిన ఈ కామెంట్స్‌ను తీవ్రంగా పరిగణించిన హుజూరాబాద్ స్థానిక పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.
Bandi Sanjay: కోర్టులో వీగిపోయిన ఆరోపణలు.. ఆధారాలు లేవన్న న్యాయస్థానం
ఈ కేసు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు చేరింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. బండి సంజయ్‌పై పోలీసులు మోపిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి పక్కా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ఈ కేసును కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఈ వివాదానికి శాశ్వతంగా తెరపడినట్లయింది.

