Excise Director Rahul Dev Sharma: రాష్ట్రంలో సరిహద్దుల గుండా సాగే అక్రమ మద్యం రవాణా, పల్లెలను పట్టిపీడిస్తున్న నాటుసారా తయారీ మరియు యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ (Rahul Dev Sharma IPS) అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నాడు నెల్లూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అధికారిక కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి ‘వార్షిక నేర సమీక్ష సమావేశంలో’ (Crime Review Meeting) ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 11 ఎక్సైజ్ స్టేషన్లకు సంబంధించిన కేసుల ప్రగతిని ఆయన క్షుణ్ణంగా సమీక్షించి, క్షేత్రస్థాయి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుండి నెల్లూరు జిల్లా సరిహద్దుల గుండా అక్రమ మద్యం (Non-Duty Paid Liquor) రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చెక్‌పోస్టుల వద్ద పటిష్ఠ తనిఖీలు చేపట్టాలన్నారు.
బెల్టు దుకాణాల నిర్మూలన - 3 నెలల లైసెన్స్ గడువుపై ఆరా
జిల్లా వ్యాప్తంగా పాత నేరస్థుల రికార్డులను పరిశీలించి, నేరాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాలపై (Hyper-sensitive areas) ప్రత్యేక నిఘా ఉంచాలని డైరెక్టర్ సూచించారు. నాటుసారా తయారీ, రవాణా, మరియు విక్రయదారులపై పిడి (PD) యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగించాలన్నారు. పల్లెల్లో బెల్టు దుకాణాలను పూర్తిగా అరికట్టడంతో పాటు, బహిరంగ మద్యపానానికి (Public Drinking) తావులేకుండా కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు కేవలం 3 నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున.. నిబంధనల ప్రకారం పెండింగ్ ఫీజుల వసూళ్లు వేగవంతం చేయాలని, దుకాణాల్లో అనధికార నిల్వలు (Illegal Stocks) ఉంచితే సీజ్ చేయాలని ఆదేశించారు.
Excise Director Rahul Dev Sharma: గంజాయి ముద్దాయిలకు తహసీల్దార్ల ఎదుట బైండోవర్
యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్న గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని క్షేత్రస్థాయిలోనే నిలువరించాలని అధికారులను డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఆదేశించారు. ఎన్‌డీపీఎస్ (NDPS) మరియు గంజాయి కేసుల్లో దొరికిన ముద్దాయిలను విధిగా స్థానిక తహసీల్దార్ల (ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్) ఎదుట హాజరుపరచి ‘బైండోవర్’ (Bind Over) ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. పెండింగ్ దర్యాప్తు కేసుల్లో త్వరితగతిన చార్జ్‌షీట్లు (Charge Sheets) దాఖలు చేసి కోర్టుల్లో శిక్షలు పడేలా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో పరారీలో ఉండి, అరెస్టు కావాల్సిన ప్రధాన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు.

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి మద్యం క్రయవిక్రయాలు జరిపితే సదరు బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపుల యజమానులపై కఠిన క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ ఉన్నత స్థాయి నేర సమీక్షా సమావేశంలో నెల్లూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం. శంకరయ్య, సహాయ కమిషనర్ పి. దయాసాగర్ తో పాటు జిల్లా పరిధిలోని 11 ఎక్సైజ్ స్టేషన్లకు చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు (CIs), సబ్ ఇన్‌స్పెక్టర్లు (SIs) మరియు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది పాల్గొన్నారు.
Epaper: epaper.vaartha.com

