Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు!

నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు!

వార్త 1 week ago

Mandamarri Fake Seeds Gang: వానాకాలం సాగు సీజన్ ప్రారంభమైన తరుణంలో అమాయక రైతులను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలతో నిలువునా ముంచేందుకు యత్నిస్తున్న అంతర్ జిల్లా నకిలీ విత్తనాల ముఠా గుట్టును మందమర్రి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా రట్టు చేశారు.

మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) పర్స రమేష్ ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించిన ఈ మెరుపు దాడిలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ. 75,000 విలువైన నకిలీ పత్తి విత్తనాలు, ఒక కార్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Read Also : తమిళనాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి పరిధిలోని రామన్ కాలనీ బ్రిడ్జి సమీపంలో ఎలాంటి అనుమతులు లేని నకిలీ విత్తనాల రవాణా జరుగుతోందన్న పక్కా ముందస్తు సమాచారంతో పోలీసులు, అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా వ్యూహాత్మక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఒక అనుమానాస్పద స్విఫ్ట్ డిజైర్ కారును (TS19 H 5554) అడ్డుకుని తనిఖీ చేయగా, అందులో ఎలాంటి రసీదులు, బిల్లులు లేకుండా నిల్వ ఉంచిన 30 కిలోల నకిలీ పత్తి విత్తనాలు బయటపడ్డాయి.

కిలో రూ. 1000 కి కొని.. రూ. 2500 కి విక్రయం!

కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, వారు శ్రీపతి నగర్‌కు చెందిన తండ్రీకొడుకులు మహమ్మద్ సాహెబ్ జానీ (54), అతని కుమారుడు మహమ్మద్ అఫ్రోజ్ (29)గా పోలీసులు గుర్తించారు. నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన ఒక ప్రధాన ఏజెంట్ వద్ద నుండి కిలో కేవలం రూ. 1,000 చొప్పున ఈ నకిలీ విత్తనాలను కొనుగోలు చేశారు. వీటిని మందమర్రి పరిసర గ్రామాల అమాయక రైతులకు కిలో ఏకంగా రూ. 2,500 చొప్పున అంటగట్టి భారీగా లాభాలు ఆర్జించాలని ప్లాన్ చేశారు. రైతులు గుర్తుపట్టకుండా నమ్మించేందుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పేరొందిన కంపెనీల బ్రాండెడ్ సంచులలో ఈ విత్తనాలను ప్యాక్ చేసి మోసానికి పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది.

Mandamarri Fake Seeds Gang: నకిలీలు విక్రయిస్తే పీడీ యాక్ట్: సీఐ పర్స రమేష్

సమయస్ఫూర్తితో వ్యవహరించి రైతుల పొలాల్లో నకిలీ విత్తనాలు పడకుండా ముందే కేసును ఛేదించిన మందమర్రి సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) జి. నరేష్, కానిస్టేబుళ్లు రాకేష్, చైతన్యలను సీఐ పర్స రమేష్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. వానాకాలం సాగు పనులు మొదలవుతున్నందున రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రభుత్వ గుర్తింపు పొందిన లైసెన్స్‌డ్ డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, లావాదేవీలకు సంబంధించి తప్పనిసరిగా రసీదులు (బిల్లులు) అడిగి తీసుకోవాలని కోరారు. ఎక్కడైనా రహస్యంగా లేదా తక్కువ ధరలకే నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు గానీ, వ్యవసాయ అధికారులకు గానీ సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పట్టుబడిన తండ్రీకొడుకులపై సంబంధిత అగ్రికల్చర్ యాక్ట్ మరియు చీటింగ్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు, దీని వెనుక ఉన్న బైంసా ముఠా లింకులపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రైతులకు 7 శాతం వడ్డీతో పంట రుణాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha