Nalgonda Murder Case: నల్గొండ పట్టణాన్ని కుదిపేసిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఉదంతాన్ని తెలంగాణ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది మరెవరో కాదు..
మృతులకు అత్యంత సమీప బంధువులేనని విచారణలో తేలింది. ఈ దారుణానికి పాల్పడిన మృతురాలు హసీనా మేనకోడలు, ఆమె భర్తతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.

ఆర్థిక గొడవలు.. పాత కక్షలే కారణం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సయ్యద్ అస్లాం (28), అతని భార్య తబస్సుమ్ (28), వారికి సహకరించిన స్నేహితుడు మహమ్మద్ సోహైల్ (26), దొంగిలించిన సొమ్మును కొనుగోలు చేసిన నగల వ్యాపారి హేమంత్ కుమార్ (28)లను అదుపులోకి తీసుకున్నారు. గతంలో మృతురాలు హసీనా దగ్గర నిందితులు అప్పు తీసుకున్నారు. ఇటీవల మరోసారి డబ్బులు అడగగా ఆమె నిరాకరించడంతో నిందితులు కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా వారిని అంతమొందించి, ఇంట్లో ఉన్న డబ్బు, నగలు దోచుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం ప్రధాన నిందితుడు అస్లాం, యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు చూసి మరీ హత్యా విధివిధానాలను నేర్చుకోవడం గమనార్హం.
Nalgonda Murder Case: ఆ రాత్రి ఏం జరిగిందంటే..?
జూన్ 19, 20 మధ్య రాత్రి సమయంలో అస్లాం పథకం ప్రకారం హసీనా ఇంట్లోకి చొరబడ్డాడు. మొదట హసీనాను కడతేర్చాడు. ఆ సమయంలో ఆమె అరుపులు విని గదిలోకి వచ్చిన భర్త సుల్తాన్, కుమారుడు ముజమ్మిల్‌లను కూడా వరుసగా నరికి చంపాడు. ఈ ఘోరాన్ని చూసి భయంతో మంచం కింద దాక్కున్న చిన్న కుమార్తె అఫ్రాను సైతం వదలకుండా కిరాతకంగా ప్రాణాలు తీశాడు. అనంతరం బీరువాలో ఉన్న బంగారం, నగదుతో పారిపోయాడు.
సాంకేతిక ఆధారాలతో నిందితులు చిక్కారిలా..
జూన్ 22న ఆ ఇల్లు మూసి ఉండి, లోపలి నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, సెల్ ఫోన్ సిగ్నల్స్ వంటి సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను ట్రాక్ చేసి, నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
ఆర్ఎస్ ప్రవీణ్ హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.. శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు

