Hyderabad: నగరంలో వాటర్ ట్యాంకర్ల ద్వారా జరుగుతున్న నీటి వృథాను అరికట్టేందుకు హైదరాబాద్ జలమండలి కఠిన నిబంధనలకు సిద్ధమైంది. నీటి సంరక్షణే లక్ష్యంగా ట్యాంకర్ల నిర్వహణపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేయనున్నట్లు జలమండలి ఎండీ కె.
అశోక్ రెడ్డి వెల్లడించారు.
Rain Alert: ఏపీకి వాయుగుండం ముప్పు.. IMD హెచ్చరిక
నవంబర్ 1 నుంచి భారీ జరిమానాలు, రిజిస్ట్రేషన్ రద్దు
కొత్త నిబంధనల ప్రకారం.. 2026 నవంబర్ 1 నుంచి నిబంధనలు ఉల్లంఘించే వాటర్ ట్యాంకర్లకు రూ. 5 వేల జరిమానా విధించనున్నారు. ఒకవేళ ఎవరైనా రెండోసారి కూడా ఈ ఉల్లంఘనలకు పాల్పడితే, సంబంధిత ట్యాంకర్ రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా రద్దు చేయనున్నట్లు జలమండలి స్పష్టం చేసింది.

సామర్థ్యానికి మించి నీరు నింపితే కఠిన చర్యలు
ట్యాంకర్లలో వాటి నిర్దేశిత సామర్థ్యానికి మించి నీటిని నింపడం వల్ల రోడ్లపై నీరు వృథా అవుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ట్యాంకర్లలో లీకేజీలు ఉన్నా,
సరైన మూతలు లేకపోయినా, మూతలను సరిగా మూసివేయకపోయినా నీటిని నింపేందుకు అనుమతించబోమని పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని ట్యాంకర్లకు ఫిల్లింగ్ స్టేషన్లలో నీటి నింపే ప్రక్రియను తక్షణమే నిలిపివేయనున్నారు.
ఫిల్లింగ్ స్టేషన్లలో విస్తృత తనిఖీలు
నీటిని నింపే ముందు ప్రతి ట్యాంకర్‌ను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జలమండలి ఎండీ ఆదేశించారు. నగరంలోని అన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో ఈ నిబంధనలు కచ్చితంగా అమలవుతున్నాయా లేదా అనే అంశంపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఉల్లంఘనలకు పాల్పడే వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
యజమానులు, డ్రైవర్లకు విజ్ఞప్తి
నీటి వృథాను అరికట్టడంలో ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కె. అశోక్ రెడ్డి సూచించారు. ట్యాంకర్ అసోసియేషన్లు కూడా తమ సభ్యులకు ఈ కొత్త నిబంధనలపై అవగాహన కల్పించాలని కోరారు. నీటి రవాణా సమయంలో ఎలాంటి లీకేజీలు జరగకుండా ట్యాంకర్లను జాగ్రత్తగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు అందరూ సహకరించాలని జలమండలి కోరింది.

