Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు

నేడు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు

వార్త 1 week ago

Today weather report: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భానుడి భగభగలు కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉపశమనాన్ని ఇస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఉభయ రాష్ట్రాల వాతావరణంపై కీలక నివేదికను విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను తాకాయని, తెలంగాణలోకి కూడా నేడు లేదా రేపటికల్లా ఇవి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం చల్లబడనుంది.

Read also: Telangana Land Registration Charges : రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై మంత్రి పొంగులేటి క్లారిటీ

ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం (జూన్ 6) నాటికే నైరుతి రుతుపవనాలు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లోకి ప్రవేశించాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే, ఈ ఏడాది సీజన్ మొత్తం మీద నమోదయ్యే వర్షపాతం సాధారణం కంటే స్వల్పంగా తక్కువగా ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. స్థానిక వాతావరణ మార్పుల వల్ల కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు భర్తీ చేస్తాయన్నారు. కాకపోతే, ఈసారి రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు (Monsoon Breaks) వచ్చే అవకాశం ఉందని, అంటే కొన్ని రోజులు వానలు పడి, మరికొన్ని రోజులు పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మార్పులను గమనించి రైతులు తమ పంట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.

Today weather report: ఏపీలో జిల్లాల వారీగా వర్షపాత అంచనాలు (జూన్ – సెప్టెంబర్ 2026)

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు నెలల కాలానికి సంబంధించి వర్షపాతం ఎలా ఉండబోతోందో విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వర్గీకరించి వివరించారు:

సాధారణం కంటే తక్కువ వర్షపాతం: పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురము, వైఎస్‌ఆర్ కడప, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నాయి.

సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం: ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఈసారి వానలు దంచికొట్టే అవకాశం ఉంది.

సాధారణ వర్షపాతం: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయి.

ఆది, సోమవారాల్లో పిడుగుల హెచ్చరిక.. కొన్నిచోట్ల వడగాల్పుల తీవ్రత

ఆదివారం, సోమవారం రోజుల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆదివారం (07-06-2026) పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడే ఛాన్స్ ఉంది. అయితే, మరోవైపు ఉత్తరాంధ్ర సహా కొన్ని ప్రాంతాల్లో రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం (12 మండలాలు), విజయనగరం (22), మన్యం (12), అల్లూరి (1), పోలవరం (2), విశాఖ (1), కాకినాడ (8) కలిపి మొత్తం 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 104 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

తెలంగాణకు చల్లటి కబురు.. హైదరాబాద్‌లో మారిన వాతావరణం

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త చెప్పింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం.. ఆదివారం లేదా సోమవారంలోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. దీనికి సంకేతంగా ఇప్పటికే రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై, తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. రుతుపవనాల రాకతో రాబోయే రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

రేపటి నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha