IND vs WI 4th T20: హైదరాబాద్‌లో క్రికెట్ సందడి నెలకొంది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్ బుధవారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు.
Jagtial News: మెట్‌పల్లిలో కొత్త కోడలికి 25 రకాల బతుకమ్మలతో వాయినం
మధ్యాహ్నం 12 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు
మ్యాచ్ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నాగోల్ యూటర్న్, మెహఫిల్ జంక్షన్, హబ్సిగూడ జంక్షన్, రామంతాపూర్ స్ట్రీట్ నంబర్ 8 ప్రాంతాల్లో భారీ వాహనాలను దారి మళ్లించనున్నారు. ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు కోరారు.
భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు

వరంగల్ నుంచి ఉప్పల్ మీదుగా హైదరాబాద్ వచ్చే భారీ వాహనాలు ఘట్‌కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎక్కి అబ్దుల్లాపూర్‌మెట్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ మీదుగా నగరంలోకి రావాల్సి ఉంటుంది.
అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వెళ్లే వాహనాలు ఎల్బీనగర్, హయత్‌నగర్ మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఇతర ప్రాంతాల నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను కూడా పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.
మెట్రో, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోండి
మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చే అభిమానులు వ్యక్తిగత వాహనాలకు బదులుగా మెట్రో రైళ్లు, ప్రత్యేక ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ముందుగానే బయలుదేరాలని కోరారు. స్టేడియం పరిసరాల్లో పోలీసుల సూచనలు పాటించాలని, అత్యవసర వాహనాల రాకపోకలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

