PM Modi: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
విపత్తు వేళ నేపాల్‌కు అన్ని విధాలా మానవతా దృక్పథంతో కూడిన సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
ఈ మేరకు ప్రధాని మోదీ ‘ఎక్స్’ (X) వేదికగా స్పందిస్తూ, “నేపాల్‌లో వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సంతాపం తెలియజేస్తూ ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడాను. భారత ప్రజలు ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌లోని తమ సోదర సోదరీమణులకు పూర్తి సంఘీభావంతో అండగా నిలుస్తారు. సహాయక, పునరావాస చర్యల విషయంలో మా బృందాలు నేపాల్‌తో సమన్వయంతో పనిచేస్తున్నాయి” అని పేర్కొన్నారు.
Read Also : Nepal Flash Floods: వరద బీభత్సం.. 105 మంది భారతీయులు గల్లంతు!
PM Modi responds to Nepal floods; assures support.
PM Modi: ఉప్పొంగిన భోటే కోశి.. తీవ్రంగా దెబ్బతిన్న రసువా జిల్లా
టిబెట్ దిశ నుండి భోటే కోశి నది ఉప్పొంగడంతో బుధవారం ఉదయం ఉత్తర నేపాల్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రసువా జిల్లాలోని తిమురే, సఫ్రుబేసి, రసువాగధి ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న నువాకోట్, ధాడింగ్ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉదయం 9 గంటల సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహానికి వాహనాలు, వంతెనలు, మౌలిక సదుపాయాలు కొట్టుకుపోయాయి. అంతేకాకుండా పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది ప్రయాణికులు, సరిహద్దు గస్తీ సిబ్బంది గల్లంతయ్యారు.
105 మంది భారతీయులతో సహా 384 మంది యాత్రికులు గల్లంతు
నేపాల్ పర్యాటక బోర్డు సంకలనం చేసిన ప్రాథమిక జాబితా ప్రకారం మొత్తం 384 మంది యాత్రికులు (291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీలు) గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా కైలాష్ మానసరోవర్ యాత్ర కోసం టిబెట్‌కు వెళ్తున్న యాత్రికులుగా భావిస్తున్నారు. భారతీయులతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, యూకే, మలేషియా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నారు.
వేగంగా సాగుతున్న సహాయక చర్యలు
నేపాల్ సైన్యం, సాయుధ పోలీసు దళం, నేపాల్ పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.
- హెలికాప్టర్లు, డ్రోన్లు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాలను ఉపయోగించి గాలింపు చర్యలను వేగవంతం చేశారు.
- బుధవారం మధ్యాహ్నానికి 25 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి వివరాలను ఇంకా ధృవీకరిస్తున్నారు.
నేపాల్‌ను ముంచెత్తిన వరదలు.. 8 మంది మృతి, వందలాది మంది గల్లంతు

