NEET 2026: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరిగిన నీట్ (NEET) ప్రవేశ పరీక్షా కేంద్రాల వద్ద తెలంగాణలో గుండెలవిసే అత్యంత దారుణమైన, భావోద్వేగ దృశ్యాలు వెలుగు చూశాయి.
నిమిషాల వ్యవధిలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించకపోవడంతో పరీక్షా కేంద్రాల గేట్ల వద్ద తల్లిదండ్రులు, విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సెక్యూరిటీ సిబ్బంది, పోలీసు అధికారుల కాళ్లపై పడి తల్లులు వేడుకున్నప్పటికీ నిబంధనల పేరుతో అధికారులు కనికరం చూపకపోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
Read Also :NEET UG 2026 Re-exam: నీట్ రీ ఎగ్జామ్ పూర్తి.. ఇక రిజల్ట్స్‌పై అందరి దృష్టి
NEET 2026: కాళ్లపై పడ్డ కన్నతల్లి.. గూగుల్ మ్యాప్స్ తెచ్చిన తిప్పలు
నిబంధనల ప్రకారం గేట్లు మూసివేసే సమయం దాటిన తర్వాత వచ్చిన పలువురు విద్యార్థులను సిబ్బంది నిర్దాక్షిణ్యంగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెండు వేర్వేరు కేంద్రాల వద్ద హృదయవిదారక ఘటనలు జరిగాయి. ఒక ఎగ్జామ్ సెంటర్ వద్ద గేట్లు మూసివేయడంతో, తన కుమార్తె జీవితం ముగిసిపోతుందేమోనన్న ఆందోళనతో ఒక కన్నతల్లి అక్కడి సెక్యూరిటీ గార్డుల కాళ్లపై పడి, దండం పెడుతూ లోపలికి పంపించమని ఏడుస్తూ బతిమిలాడింది. మరో కేంద్రం వద్ద కేవలం 2 నిమిషాల ఆలస్యంగా వచ్చిన విద్యార్థినిని అధికారులు లోపలికి రానివ్వలేదు.
దీనిపై సదరు విద్యార్థిని తండ్రి అధికారులను బతిమాలుతూ.. “గూగుల్ మ్యాప్స్ (Google Maps) తప్పుడు రూట్ చూపించడం వల్లే తాము దారి తప్పి 2 నిమిషాలు లేట్ అయ్యాము” అని, తన బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనుమతించాలని కన్నీళ్లతో ప్రార్థించాడు. అయినప్పటికీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కఠిన నిబంధనల కారణంగా అధికారులు అనుమతి నిరాకరించారు. ఏడాది పాటు కష్టపడి చదివిన చదువు కేవలం నిమిషాల ఆలస్యంతో పరీక్ష రాసే అవకాశం కోల్పోవడంతో విద్యార్థినులు గేట్ల ముందే స్పృహతప్పి పడిపోగా, పరీక్షా కేంద్రాల వద్ద ఉద్రిక్త మరియు నిరాశ నిండిన వాతావరణం కనిపించింది.

