Dagumati Venkata Krishna Reddy: కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా చివరి ఆయకట్టు రైతులకు సైతం సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన సోమవారం సాయంత్రం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కావలి కాలువ నీటి నిర్వహణ, 12వ కిలోమీటరు వద్ద దెబ్బతిన్న సైఫన్ మరమ్మతులు, చివరి పాంత్రాల వరకు సాగునీటి సరఫరాపై విస్తృతంగా చర్చించారు.
వారాబందీ విధానం అమలు - సమన్యాయం
సమావేశం అనంతరం ఎమ్మెల్యే దగుమాటి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రైతులందరికీ సమన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. కాలువ పరిధిలో ఇంజన్ మోటార్లు ఉన్న రైతులకు వారానికి మూడు రోజులు మాత్రమే సాగునీరు అందించేలా కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిగిలిన నాలుగు రోజుల్లో అనధికార మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి చివరి ఆయకట్టు రైతులకు కాలువ నీరు అందేలా వారాబందీ విధానం అమలు చేస్తామన్నారు. సోమశిలలో నీటి లభ్యత పుష్కలంగా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు.
Dagumati Venkata Krishna Reddy: సైఫన్ శాశ్వత పునర్నిర్మాణం
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. కావలి కాలువ 12వ కిలోమీటరు వద్ద దెబ్బతిన్న సైఫన్‌ను స్వయంగా పరిశీలించామని, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని శాశ్వత ప్రాతిపదికన పునర్నిర్మిస్తామని తెలిపారు. దెబ్బతిన్న ఇతర నిర్మాణాలు, గేట్ల మరమ్మతులు వేగవంతం చేస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ.. సోమవారం నుంచే వారాబందీ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూ శాఖలను ఆదేశించారు. సైఫన్ మరమ్మతులకు వెంటనే టెండర్లు పిలిచి నీటి ప్రవాహం నిలిచిన వెంటనే పనులు ప్రారంభించి నవంబర్ 30లోపు పూర్తి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్‌ఈలు, ఆత్మకూరు, కావలి ఆర్డీవోలు మరియు నీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పెమ్మసాని చంద్రశేఖర్ కు సంకెళ్లు వేసి నిలబెట్టడం ఖాయం - అంబటి

