Bengaluru Women Skeleton: ఐటీ రాజధాని బెంగళూరులో ఒంటరితనం, మానవ సంబంధాల రాహిత్యానికి అద్దం పట్టే దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. బాగలగుంటె ప్రాంతంలోని ఒక డూప్లెక్స్ ఇంట్లో సుమారు ఏడాది కాలంగా ఎవరి కంటా పడకుండా ఉన్న 52 ఏళ్ల మహిళ అస్థిపంజరాన్ని పోలీసులు కనుగొన్నారు.
మృతురాలిని హవనూర్ లేఅవుట్‌కు చెందిన దాక్షాయిణి (52)గా పోలీసులు గుర్తించారు.
Read Also :Jakkur Nepali Girls: సమాజం ఒప్పుకోలేదని.. ఇద్దరు నేపాలీ యువతుల ఆత్మహత్య!

వరుస విషాదాలు.. తీవ్ర డిప్రెషన్‌తో ఒంటరి జీవనం
బాధిత మహిళ దాక్షాయిణి సుమారు 10 ఏళ్ల క్రితం తన భర్త ఉమేశ్‌ను కోల్పోయారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆమె కుమారుడు కూడా క్యాన్సర్ వ్యాధితో మరణించడంతో ఆమె జీవితంలో తీవ్ర శోకం మిగిలింది. కుటుంబ సభ్యులను కోల్పోవడంతో ఆమె తీవ్ర మానసిక కుంగుబాటుకు (డిప్రెషన్) గురయ్యారు. హవనూర్ లేఅవుట్‌లోని డూప్లెక్స్ ఇంట్లో అప్పటి నుంచి ఎవరితోనూ కలవకుండా ఒంటరిగానే నివాసముంటున్నారు. ఆమె దాదాపు ఏడాది క్రితమే ఇంట్లో మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సుదీర్ఘమైన ఏడాది కాలంలో ఆమె కూతురు గానీ, అల్లుడు గానీ ఆమెను చూడటానికి ఇంటికి రాకపోవడం, ఆరా తీయకపోవడంతో ఆమె మరణం ఇన్నాళ్లూ వెలుగులోకి రాలేదు.
Bengaluru Women Skeleton: పోలీసుల దర్యాప్తు
పొరుగువారు మరియు సమాచారం ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకున్న బాగలగుంటె పోలీసులు తలుపులు తెరిచి చూడగా, ఇంట్లో అస్థిపంజరం మాత్రమే కనిపించింది. పోలీసులు అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె సహజంగా మరణించిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. కోట్లాది మంది నివసించే మహానగరంలో కనీసం పక్కన ఉన్నవారు, కన్నపిల్లలు కూడా పట్టించుకోక ఏడాది పాటు మృతదేహం అస్థిపంజరంగా మారడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

