Maa Inti Bangaram: స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రం 'మా ఇంటి బంగారం'. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి రెడీ అయిపోయింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar) లో ఈ సినిమా జూలై 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ క్లీన్ హిట్ చిత్రం, నెల రోజులు తిరక్కుండానే ఓటీటీ వీక్షకులను పలకరించేందుకు సిద్ధమవడం విశేషం.

రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి లేడీ ఓరియెంటెడ్ తెలుగు సినిమా
ప్రతిభావంతమైన దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన 'మా ఇంటి బంగారం' థియేటర్లలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. యాక్షన్, కామెడీ, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కలబోతగా వచ్చిన ఈ మూవీ ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. టాలీవుడ్‌లో ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఈ స్థాయి కలెక్షన్లు సాధించడం ఇదే మొదటిసారి. ఇందులో 'స్వర్ణ' అనే అనాథ యువతి పాత్రలో సమంత వండర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా సామ్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు, కామెడీ టైమింగ్ థియేటర్లలో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించాయి.
Maa Inti Bangaram: సమంత నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్ట్
ఈ సినిమాను సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి స్వయంగా నిర్మించడం విశేషం. ఈ చిత్రంలో దిగంత్ మంచాలే, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి వంటి పాపులర్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమా జూలై నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో ఓటీటీకి వస్తుందని అందరూ భావించారు. కానీ, ప్రేక్షకుల్లో ఉన్న భారీ క్రేజ్ దృష్ట్యా అనుకున్న సమయం కంటే ముందే డిజిటల్ ప్రీమియర్‌కు డేట్ లాక్ చేశారు.

