Afghanistan airstrike on Pakistan : సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద స్థావరాల నేపథ్యంలో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా శిఖరాగ్రానికి చేరాయి.
పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా అఫ్గానిస్థాన్‌కు చెందిన తాలిబన్ సైనిక దళాలు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భీకర ఎయిర్ స్ట్రైక్స్ (వైమానిక దాడులు) జరిపాయి. పాక్‌లోని అశాంత ప్రాంతాలైన ఖైబర్ పఖ్తుంక్వా, బలూచిస్థాన్ ప్రావిన్సులపై అఫ్గాన్ దళాలు అత్యాధునిక డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. అక్కడ ఆశ్రయం పొందుతున్న ఐసిస్-కె (ISIS-K ఖొరాసన్) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా, ఈ దాడిలో పలువురు అగ్రశ్రేణి ఉగ్రవాద కమాండర్లు హతమైనట్లు అఫ్గాన్ అధికారికంగా ప్రకటించింది. గత ఆదివారం అఫ్గాన్ భూభాగంపై పాకిస్థాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ భారీ సైనిక చర్యకు పూనుకున్నట్లు తాలిబన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలు – భారత్ మద్దతు
ఈ ఆకస్మిక వైమానిక దాడులతో అటు పాకిస్థాన్‌తో పాటు ఇటు అంతర్జాతీయ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అఫ్గాన్ సరిహద్దు దాటి వచ్చి పాక్ సార్వభౌమాధికారానికి భంగం కలిగించిందని ఇస్లామాబాద్ వాదిస్తుండగా, తమ దేశ రక్షణ కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లు కాబూల్ సమర్థించుకుంటోంది. ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయంగా వ్యూహాత్మక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా, అంతకుముందు అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఏకపక్షంగా పొరుగు దేశాలపై దాడులు చేయడం సరికాదని, ప్రాంతీయ శాంతికి ఇది భంగకరమని భారత్ పేర్కొంది. ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిన పాకిస్థాన్‌కు ఇప్పుడు పొరుగున ఉన్న తాలిబన్ ప్రభుత్వం నుంచే గట్టి ఎదురుదెబ్బ తగలడం అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

