KTR vs Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాల్-ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) స్వీకరించారు. కాంగ్రెస్ ప్రస్తుత పాలన, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను పూర్తిగా సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ చర్చకు సంబంధించిన తేదీ, సమయాన్ని సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా ఖరారు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గడువులో ఇప్పటికే సగం కాలం పూర్తయినా, ప్రజలకు చెప్పుకోవడానికి ఒక్క విజయం కూడా లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వరి సాగు 2014-15 నాటికి ఉన్న 26 లక్షల హెక్టార్ల నుంచి, తమ పాలన ముగిసే సమయానికి 59 లక్షల హెక్టార్లకు పెరిగిందని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
Ready for a debate on governance… KTR’s reaction to Revanth’s challenge.
KTR vs Revanth Reddy: 72 సార్లు ఢిల్లీ పర్యటనలు ఎందుకు చేశారు?
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం గత ప్రభుత్వంపై నిందలు వేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ. 3.5 లక్షల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా 72 సార్లు ఢిల్లీ పర్యటనలు ఎందుకు చేశారని, అక్కడ ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్లారని ఆయన ప్రశ్నించారు.
అసెంబ్లీ, ప్రెస్ క్లబ్ లేదా జూబ్లీహిల్స్ ప్యాలెస్.. వేదిక ఏదైనా బహిరంగ చర్చకు తాను ఒంటరిగానే వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. “ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో సహా నిరూపించడంలో నేను ఒకవేళ విఫలమైతే, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను” అని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఓపెన్ డిబేట్ సవాల్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
read also:
కవిత కొత్త పార్టీ 'టీఆర్ఎస్' పేరుపై సందిగ్ధత.. ఈసీకి భారీగా అభ్యంతరాలు!

