Papam Pratap Review: విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. 'మసూద' వంటి హిట్స్ తర్వాత ఆయన నటించిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ లేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది.
ఈ నేపథ్యంలో, తన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’ విషయంలో తిరువీర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం వినూత్నంగా ప్రయత్నిస్తూ, ప్రేక్షకుల్లో సింపతీ కలిగేలా పబ్లిసిటీ చేశారు. మరి ఈ పబ్లిసిటీ స్టంట్స్ సినిమాను కాపాడాయా? అసలు ఈ ప్రతాప్ కథ ఏంటి?
Read Also: Kangana on Chirag Paswan: చిరాగ్ నాకు మంచి ఫ్రెండ్: కంగనా రనౌత్
Papam Pratap Movie Review
Papam Pratap Review: కథ
సీతారామపురం అనే గ్రామంలో ఉండే ప్రతాప్ (తిరువీర్)కు చిన్నప్పటి నుంచి తన ఊరి అమ్మాయి బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ) అంటే ప్రాణం. పెద్దయ్యాక ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. అయితే, పెళ్లి జరిగిన మూడు రాత్రులకే కథ మలుపు తిరుగుతుంది. ప్రతాప్‌కు ఏదో విచిత్రమైన సమస్య ఉందని, అది తనకు ఇష్టం లేదని బుజ్జమ్మ పంచాయితీ పెట్టి పుట్టింటికి వెళ్లిపోతుంది. ఆ సమస్య ఏంటో ఆమె బయటపెట్టదు, ప్రతాప్‌నే తెలుసుకోమంటుంది. భార్య మీద ప్రేమతో ప్రతాప్ ఆ సమస్యను కనిపెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? తండ్రి వీరయ్య (అజయ్ ఘోష్) నుండి ఎదురైన ఇబ్బందులేమిటి? చివరికి వీరిద్దరూ కలిశారా లేదా అన్నదే మిగతా సినిమా.
విశ్లేషణ
దర్శకుడు హీరోకు ఒక విచిత్రమైన సమస్యను పెట్టి వినోదాన్ని పండించాలనుకున్నారు. అయితే, ఆ సమస్య చుట్టూ అల్లిన సన్నివేశాలు నత్తనడకన సాగుతూ బోర్ కొట్టిస్తాయి. సినిమా ప్రారంభం నుండి క్లైమాక్స్ వరకు కథ పెద్దగా ముందుకు కదలదు. దర్శకుడు సృష్టించిన సస్పెన్స్, ఆ సమస్య రివీల్ అయిన తర్వాత ప్రేక్షకుడికి పెద్దగా సంతృప్తిని ఇవ్వదు.
నటీనటుల పనితీరు
తిరువీర్ అమాయకమైన భర్తగా తన వంతు ప్రయత్నం చేశారు. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన బాగుంది, కానీ ఓవరాల్‌గా పాత్రలో సహజత్వం లోపించింది. అజయ్ ఘోష్ ఎప్పటిలాగే తనదైన శైలిలో నటించగా, క్లైమాక్స్ లో హీరో తల్లిగా రాశి నటన సినిమాకు ఒక ప్లస్ పాయింట్. గోపరాజు రమణ, రఘుబాబు, దేవిప్రసాద్ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ, బలహీనమైన సన్నివేశాల వల్ల వారి పాత్రలు వృధా అయ్యాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి, సంగీతం పర్వాలేదనిపిస్తుంది.
ముగింపు
చిన్న సినిమాలకు బలమైన కంటెంట్ ఉంటేనే థియేటర్ల వరకు ప్రేక్షకులు వస్తారు. తిరువీర్ పబ్లిసిటీ కోసం పడ్డ కష్టం బాగున్నా, కథలో దమ్ లేకపోవడం ‘పాపం ప్రతాప్’కు మైనస్ అయింది. వినోదం కోసం వెళ్లి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఈ సినిమాలో నెలకొంది. కొత్తదనం కోసం చూసే వారు ఒకసారి ఓటీటీలో ప్రయత్నించవచ్చు, కానీ థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ పరంగా ఇది నిరాశపరిచే చిత్రమే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

