Silver Rate Crash: దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. గడిచిన పది రోజుల వ్యవధిలోనే కిలో వెండి ధర దాదాపు రూ. 33,000 వరకు తగ్గడం మదుపరులను, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దీంతో దేశీయంగా కిలో వెండి ధర రూ. 2 లక్షలకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి, పెరిగిన ముడి చమురు ధరలు, తీవ్రమవుతున్న ద్రవ్యోల్బణ భయాలు వెండి ధరలను అధోముఖంగా నెట్టివేస్తున్నాయి.
PC Jeweller Share Price: పీసీ జ్యూవెలర్స్ ఇన్వెస్టర్లకు నిధుల వర్షం
Silver prices have fallen-is this the right time to buy?
Silver Rate Crash: రూ. 2 లక్షల దిగువకు స్పాట్ ధరలు
అక్టోబర్ 22న డిసెంబర్ డెలివరీ వెండి ఫ్యూచర్స్ ఒప్పందం కిలోకు రూ. 1,99,917 వద్ద ముగిసింది. అదే సమయంలో స్పాట్ మార్కెట్‌లోనూ వెండి ధరలు రూ. 2 లక్షల మార్కు కంటే కిందకే చేరాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైన ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి చూస్తే వెండి ధరలు దాదాపు సగానికి (50%) పడిపోవడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా విలువైన లోహాలకు డిమాండ్ తగ్గడం, డాలర్ బలోపేతం కావడం, చమురు ధరకు తోడు వడ్డీ రేట్ల పెరుగుదల భయాలు వడ్డీ రాబడి ఇవ్వని బంగారం, వెండి వంటి లోహాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయమేనా?
వెండి ధరలు భారీగా క్షీణించడంతో కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కానీ, వెంటనే ఒకేసారి పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెండి ధర ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల మద్దతు స్థాయి వద్ద నిలదొక్కుకుంటుందా లేదా మరింత పడుతుందా అనేది వేచి చూడాలి.
ఒకవేళ రూ. 2 లక్షల స్థాయిని నిలబెట్టుకోలేకపోతే మరిన్ని నష్టాలు తప్పవని విశ్లేషిస్తున్నారు. ధరలు తిరిగి పుంజుకుని రూ. 2.07 లక్షలు - రూ. 2.08 లక్షల స్థాయిని దాటితేనే మార్కెట్లో కొంత స్థిరత్వం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.
మదుపరులకు నిపుణుల సూచనలు
దీర్ఘకాలం పాటు వెండిలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు మొత్తం డబ్బును ఒకేసారి పెట్టకుండా, తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా విడతల వారీగా పెట్టుబడి పెట్టడాన్ని పరిశీలించవచ్చు. ఇప్పటికే అధిక ధరకు వెండి కొనుగోలు చేసినవారు మార్కెట్‌లో ధరలు తగ్గుతున్నాయని ఆందోళన చెంది వెంటనే విక్రయించడం లేదా నష్టాలను భర్తీ చేసుకోవాలనే ఉద్దేశంతో భారీగా అదనపు కొనుగోళ్లు చేయడం వంటి నిర్ణయాలకు తొందరపడకూడదు. వెండి ధరలపై అంతర్జాతీయ పారిశ్రామిక డిమాండ్, డాలర్ విలువ, క్రూడ్ ఆయిల్ ధరలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ఈ పరిణామాలను గమనిస్తూ తమ పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్‌ను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

