Padma Shri Award : తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్‌లను దేశంలోనే నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ' వరించింది.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన రెండవ విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా వీరిద్దరూ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. దశాబ్దాలుగా తమ విలక్షణమైన నటనతో, సామాజిక సేవా కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరపని ముద్ర వేసినందుకు గానూ కేంద్ర ప్రభుత్వం వీరిని ఈ గౌరవంతో సత్కరించింది. వీరితో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ నటుడు ఆర్. మాధవన్‌కు కూడా కళారంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి పద్మశ్రీ పురస్కారాన్ని అందజేశారు. ఈ వేడుకతో తెలుగు సినిమా కీర్తి జాతీయ స్థాయిలో మరోసారి వెలిగింది.

రెండో విడతలో 65 మందికి పురస్కారాలు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల పంపిణీ ప్రక్రియలో భాగంగా ఈ విడత కార్యక్రమానికి విశేష ప్రాధాన్యత దక్కింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మొదటి విడతలో ఇప్పటికే 66 మందికి ఈ పురస్కారాలను అందజేయగా, రెండవ విడతలో భాగంగా మరో 65 మంది సాధకులను పద్మ అవార్డులతో గౌరవించారు. ఈ విడత ప్రదానోత్సవంలో మొత్తం రెండు పద్మ విభూషణ్, ఏడు పద్మభూషణ్‌తో పాటు 56 పద్మశ్రీ పురస్కారాలను వివిధ రంగాల ప్రముఖులకు అందజేశారు. దేశ రక్షణ, శాస్త్ర సాంకేతిక, సామాజిక, కళారంగాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించి ప్రదానం చేసిన ఈ అవార్డుల వేడుకలో.. సినిమా రంగానికి చెందిన నటులు ఒకే వేదికపై పద్మ పురస్కారాలు అందుకోవడం అభిమానులకు మరియు చలనచిత్ర వర్గాలకు ఎంతో గర్వకారణంగా నిలిచింది.

