Palle Veekshana Program: గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించడమే 'పల్లె వీక్షణ' కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
గురువారం వెంకటాచలం మండల కేంద్రంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత వెంకటాచలం సమీపంలోని వడ్డిపాలెం లో చేపడుతున్న వీబీజీ-రాంజీ ఉపాధి హామీ పనులను పరిశీలించి పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్య సేవలు, మౌలిక వసతులను తనిఖీ చేసి వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని సూచించారు. వీరన్న కనుపూరు చెరువును ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇటీవల సంభవించిన తుఫానుల కారణంగా దెబ్బతిన్న వీరన్న కనుపూరు చెరువుకు రూ.47 లక్షలతో చేపట్టిన పునరుద్ధరణ పనులను పరిశీలించి, నాణ్యతతో పూర్తి చేసిన ఇరిగేషన్ అధికారులను అభినందించారు. పశుసంవర్ధక శాఖ నిర్వహించిన కృత్రిమ గర్భధారణ ప్రత్యేక శిబిరాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.
Read Also : Telangana pensions: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ల పంపిణీ
Rapid resolution of village issues through ‘Palle Veekshana’ - Collector Himanshu Shukla
Palle Veekshana Program: గ్రామసభలో ప్రజలతో ముఖాముఖి
అనంతరం నిర్వహించిన గ్రామసభలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్, ఎమ్మెల్యే ప్రతి సమస్యను శ్రద్ధగా విని సంబంధిత శాఖల అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, సాగునీరు, రహదారులు, వైద్యం, తాగునీరు, గృహ నిర్మాణం, విద్య తదితర అంశాలపై వచ్చిన వినతులను గడువులోగా పరిష్కరించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ, పల్లె వీక్షణలో అందిన ప్రతి అర్జీని ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేసి 30 రోజుల్లో పరిష్కరించేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలు కార్యాలయాలకు వచ్చే వరకు వేచి ఉండకుండా అధికారులే గ్రామాలకు వెళ్లి సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తున్నామని, పిడియాట్రిషియన్, జనరల్ వైద్యుల కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలు ఆదర్శవంతంగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు.
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించి వర్మీ కంపోస్ట్ ఉత్పత్తిని పెంచాలని సూచించారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, ఈ నెల 24న జిల్లావ్యాప్తంగా జరగనున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పేరెంట్ టీచర్ సమావేశాల్లో తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వెంకటాచలం మండలంలో సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయని కలెక్టర్ అధికారులను అభినందించారు.
అభివృద్ధి పనులకు ప్రభుత్వం పెద్దపీట
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని, దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఇరిగేషన్ రంగానికి అధిక నిధులు మంజూరై చెక్‌డ్యామ్‌లు, తూర్పు కనుపూరు చెరువు అభివృద్ధి పనులు చేపట్టడంతో రైతులకు సాగునీరు మెరుగ్గా అందుతోందన్నారు. ఉపాధి హామీ, తాగునీటి పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల అభివృద్ధి, డయాలసిస్ సెంటర్, సీఆర్‌సీ సెంటర్, సోలార్ లైటింగ్, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు వంటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా అర్హుల ఖాతాల్లో నిధులు జమయ్యాయని, వెంకటాచలం మండలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,439 ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. గతంలో భూ రీ-సర్వేలో ఏర్పడిన సమస్యలను పూర్తిగా పరిష్కరించి నిజమైన రైతులు, పేదలకు న్యాయం జరిగేలా అధికారులు పనిచేయాలని కోరారు. ప్రతి గురువారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్, పల్లె వీక్షణ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

