Pulsar @25 : భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బజాజ్ పల్సర్ 25వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ కీలక అప్‌డేట్ చేసింది.
కొత్త తరం పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లను ఆగస్టు 24, 2026న మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెండు మోడళ్లలోనూ డిజైన్ కంటే ముఖ్యంగా ఇంజిన్, ఛాసిస్, సస్పెన్షన్, టెక్నాలజీ పరంగా గణనీయమైన మార్పులు చేసింది.
కొత్త పల్సర్ 125 ధర రూ.92,990 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి. టాప్ వేరియంట్ ధర రూ.1,04,318 వరకు ఉంది. పల్సర్ 150 మూడు వేరియంట్లలో లభించనుండగా.. సింగిల్ డిస్క్ ధర రూ.1,15,233, ట్విన్ డిస్క్ సింగిల్ సీట్ రూ.1,22,184, ట్విన్ డిస్క్ స్ప్లిట్ సీట్ ధర రూ.1,23,187గా నిర్ణయించారు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
ప్రధాన మార్పుల్లో మోనోషాక్ రియర్ సస్పెన్షన్ :
కొత్త మోడళ్లలో ప్రధాన మార్పుల్లో మోనోషాక్ రియర్ సస్పెన్షన్ ఒకటి. ఇప్పటివరకు ఉన్న ట్విన్ షాక్ సెటప్ స్థానంలో మోనోషాక్‌ను తీసుకురావడం ద్వారా రైడ్ కంఫర్ట్, హ్యాండ్లింగ్, స్టెబిలిటీలో మెరుగుదల లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త డైమండ్-టైప్ ఫ్రేమ్‌ను కూడా ఉపయోగించారు.

టెక్నాలజీ విషయంలోనూ పల్సర్ 125, 150 మరింత ఆధునికంగా మారాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో 5-అంగుళాల TFT డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, LED ఇండికేటర్లు, హజార్డ్ లైట్లు, టైప్-C ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పల్సర్ 125లో ఎంపిక చేసిన వేరియంట్లకు రైడ్ మోడ్స్ కూడా అందించారు.
మరో కొత్త ఫీచర్ 'క్రాల్ టెక్'. ట్రాఫిక్‌లో చాలా తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు తరచూ క్లచ్, థ్రాటిల్ ఆపరేట్ చేయాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు దీన్ని రూపొందించారు. ఇంజిన్, గేర్‌బాక్స్‌ను కూడా మెరుగుపరిచి తక్కువ ఆర్‌పీఎంలోనే టార్క్ అందేలా మార్పులు చేశారు.
పల్సర్ 25 ఏళ్ల ప్రయాణాన్ని మరింత బలపరచడంతో పాటు 125-150 సీసీ విభాగంలో పోటీని పెంచే లక్ష్యంతో ఈ కొత్త మోడళ్లను బజాజ్ తీసుకొచ్చింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం 125 సీసీకి పైబడిన మోటార్‌సైకిళ్లు బజాజ్ మొత్తం బైక్ అమ్మకాల్లో 77.5 శాతం వాటాను కలిగి ఉండటం ఈ సెగ్మెంట్‌కు ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.

