Murshidabad Train Accident: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం నాడు అత్యంత విషాదకరమైన రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద సిబ్బంది నిర్లక్ష్యంతో తెరిచి ఉంచిన గేటు గుండా పట్టాలు దాటుతున్న ఒక పూల్ కార్ (స్కూల్ వ్యాన్/కారు)ను వేగంగా వచ్చిన రైలు దారుణంగా ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులతో పాటు కారు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
అసలేం జరిగిందంటే..?

పోలీసులు, రైల్వే వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ముర్షిదాబాద్ జిల్లా పరిధిలోని ఒక రైల్వే క్రాసింగ్ వద్ద గేటు తెరిచి ఉండటంతో, రైలు రాకను గమనించని పూల్ కార్ డ్రైవర్ వాహనాన్ని పట్టాల మీదుగా ముందుకు పోనిచ్చాడు. సరిగ్గా అదే సమయంలో అత్యంత వేగంగా దూసుకొచ్చిన రైలు ఆ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి పరుగులు తీసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సమాచారం అందుకున్న రైల్వే రక్షణ దళం (RPF), స్థానిక పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Murshidabad Train Accident: నిరసనకు దిగిన స్థానికులు – దర్యాప్తునకు ఆదేశం
రైలు వచ్చే సమయంలో రైల్వే గేటును మూసివేయకపోవడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రత్యక్ష కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైల్వే అధికారుల ఘోర నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘటనా స్థలంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉదంతంపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.
Epaper: epaper.vaartha.com

