Gold Prices Hike: గత కొన్ని రోజులుగా స్థిరంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు దేశీయ మార్కెట్‌లో మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ఏకంగా రూ.3,300 మేర పెరిగి రూ.1,50,800 వద్ద స్థిరపడింది.
ఈ భారీ పెరుగుదలతో బంగారం ధర మరోమారు అత్యంత కీలకమైన రూ.1.50 లక్షల మైలురాయిని దాటినట్లయింది. కాగా, అంతకుముందు గురువారం నాడు ఇదే మార్కెట్‌లో 10 గ్రాముల ధర రూ.1,47,500 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.

వెండి కూడా భారీ.. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ అదే జోరు
బంగారంతో పోటీ పడుతూ వెండి ధర కూడా మార్కెట్‌లో భారీగా పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, కొనుగోలుదారుల నుంచి మద్దతు లభించడంతో కిలో వెండి ధర రూ.5,000 మేర వృద్ధి చెంది రూ.2,45,000 మార్కును తాకింది. గ్లోబల్ మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల వాతావరణమే దేశీయంగా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లను దూకుడుగా పెంచకపోవచ్చనే వార్తలు రావడంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లీ మళ్లారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్సు బంగారం ధర 57 డాలర్లు పెరిగి 4,181 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Gold Prices Hike: పసిడి మళ్లీ పుంజుకోవడానికి కారణాలేంటి?
ఇటీవలి కాలంలో గరిష్ఠ స్థాయిల నుంచి బంగారం ధరలు దాదాపు 10 శాతం వరకు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో లాభాల స్వీకరణ (Profit Booking) కోసం కొందరు, ధరలు ఇంకా పడిపోతాయనే అంచనాలతో మరికొందరు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించడానికి మొగ్గు చూపారు. అయితే, అమెరికాలో ద్రవ్యోల్బణం (Inflation) క్రమంగా అదుపులోకి వస్తోందన్న సంకేతాలు వెలువడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ బలహీనపడటం వంటి ఆర్థిక పరిణామాలు పసిడి రంగానికి మళ్లీ కొత్త ఊపిరి పోశాయి.
జూలై 8న ఫెడ్ ‘మినిట్స్’ మీదే మార్కెట్ కన్ను!
రాబోయే రోజుల్లో పసిడి మరియు వెండి ధరల గమనం పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్లలోని పరిణామాలపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా జూలై 8న విడుదల కానున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశపు ‘మినిట్స్’ (Fed Minutes) నివేదిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అధికారిక నివేదిక వెలువడిన తర్వాతే బులియన్ మార్కెట్ ధరలు ఏ దిశగా పయనిస్తాయనే దానిపై ఒక స్పష్టమైన అవగాహన వస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

