Sugali Preethi Case : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన 'సుగాలి ప్రీతి' కేసు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తమకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు నమ్మకద్రోహం చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని బాధితురాలి తల్లి సుగాలి పార్వతీదేవి గన్నవరం పోలీసులను ఆశ్రయించడం రాజకీయంగా పెను కలకలం రేపింది.
పవన్ కళ్యాణ్‌పై చీటింగ్, నమ్మకద్రోహంతో పాటు నిందితులతో కుమ్మక్కయ్యారనే అంశాలపై కేసులు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్ (FIR) రాతపూర్వకంగా ఇవ్వాలని ఆమె పోలీసులను డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో తమను కలిసి అండగా ఉంటానని నమ్మించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను డిప్యూటీ సీఎం అయ్యాక చేసే మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు ఫైలుపైనే ఉంటుందని పవన్ కళ్యాణ్ పెద్దపెద్ద మాటలు చెప్పి, తీరా గెలిచాక మాట మార్చారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

గెలవక ముందు ఒకలా.. గెలిచాక మరోలా: బాధితురాలి తల్లి ఆరోపణలు
పవన్ కళ్యాణ్ గెలవక ముందు తన కుమార్తెను మానభంగం చేసి చంపేశారని మాట్లాడారని, కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ఆధారాలు లేవని, డీఎన్ఏ (DNA) నివేదికలు లేవని చెబుతూ నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చేలా వ్యవహరిస్తున్నారని పార్వతీదేవి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు ముగిసిపోతున్నా ఇప్పటివరకు తన కుమార్తె మృతి కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం అత్యంత బాధాకరమన్నారు. తన బిడ్డ మరణాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారని, న్యాయం కోసం ప్రశ్నిస్తే జనసేన పార్టీకి చెందిన స్థానిక నేతలు, కార్యకర్తలు తనపై దాడులకు దిగుతున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, తమ కుటుంబానికి పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ ద్వారా న్యాయం జరిగేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు.
వెంగళరాయసాగర్ కాలువ పూడికతీతల పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే బేబీనాయన

